Hyderabad: రోజుకు రూ. 5 కోట్లు దోచుకుంటున్న సైబర్ నేరగాడి అరెస్ట్.. చదివింది 12వ తరగతే!

Cyber Criminal who studied 12th arrested by Mumbai police in Hyderabad
  • హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు
  • రోజుకు రూ. 5 నుంచి రూ. 10 కోట్ల లావాదేవీలు
  • 40 బ్యాంకు ఖాతాల సీజ్
  • రూ. 1.5 కోట్ల నగదు స్వాధీనం
  • మరో నలుగురు నిందితులు కూడా అరెస్ట్
12వ తరగతి మాత్రమే చదువుకుని సైబర్ నేరాల బాట పట్టి, రోజుకు రూ. 5 కోట్లకుపైగా దోచుకుంటున్న సైబర్ నేరగాడు దాడి శ్రీనివాసరావు (49)ని హైదరాబాద్‌లో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఓ హోటల్‌లో తిష్టవేసిన నిందితుడు సహా ముఠాలోని మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు థానేకు చెందిన వారు కాగా, మిగతా వారు కోల్‌కతాకు చెందినవారు. 40 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిన పోలీసులు అతడి నుంచి రూ. 1.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

శ్రీనివాసరావు ముఠా ఎక్కువగా మహిళలను లక్ష్యంగా చేసుకుంటుంది. తాము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నామని, మీరు పంపిన కొరియర్‌లో డ్రగ్స్, ఆయుధాలు దొరికాయని చెప్పి తొలుత వారిని భయపెడతారు. ఆ కొరియర్‌తో తమకు సంబంధం లేదని చెబితే అది నిర్ధారించాల్సింది తామని, వెంటనే బ్యాంకు, లేదంటే ఆదాయపన్ను వివరాలు పంపాలని ఆదేశిస్తారు. 

వాటిని తనిఖీ చేశాక కొరియర్ గురించి తేలుస్తామని చెబుతారు. బాధితులు కనుక భయపడి పంపిస్తే పని అయిపోయినట్టే. ఎనీ డెస్క్ లాంటి యాప్‌ను ఉపయోగించి బాధితుల ఫోన్లను నియంత్రణలోకి తీసుకుని వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును దోచుకుంటారు. దేశవ్యాప్తంగా ఇలా వేలాదిమందిని ఈ ముఠా మోసం చేసింది. నిందితుల బ్యాంకు ఖాతాల్లో రోజుకు రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దోచుకున్న సొమ్మును నిందితుడు శ్రీనివాసరావు క్రిప్టో కరెన్సీగా మార్చి ఓ చైనా జాతీయుడికి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
Hyderabad
Cyber Criminal
Dadi Srinivasarao
Crime News

More Telugu News