Nara Lokesh: లోకేశ్‌కు సమస్యలు చెప్పుకునేందుకు బారులు తీరిన ప్రజలు.. యువగళం 88వ రోజు విశేషాలు ఇవీ..

  • కోడుమూరు శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర
  • అనుగొండలో భారీ వర్షంలోనూ కొనసాగిన ‘యువగళం’
  • తాము అధికారంలోకి వస్తే జగన్ రద్దు చేసిన పథకాలన్నింటినీ తిరిగి తెస్తామని లోకేశ్ హామీ
  • దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆవేదన
Nara Lokesh Yuva Galam Padayatra 88 day Highlights

తెలుగుదేశం పార్టీ యువతనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 88వ రోజైన బుధవారం కోడుమూరు శివారు నుంచి ప్రారంభమైంది. లోకేశ్‌‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర సందర్భంగా లోకేశ్‌ను కలిసిన ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు, పెరిగిన పన్నులు, చెత్తపన్ను తదితర వాటి గురించి చెప్పుకుని బాధపడ్డారు. చెత్తపన్ను కట్టకుంటే సంక్షేమ పథకాలు ఆపేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నామన్న యువతకు లోకేశ్ భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక పరిశ్రమలను తీసుకొచ్చి స్థానికంగానే ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. లోకేశ్ పాదయాత్ర అనుగొండ శివారుకు చేరుకున్న తర్వాత భారీ వర్షం కురిసినప్పటికీ పాదయాత్ర కొనసాగింది. రేమండూరు వద్ద పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. పాణ్యం ఇన్‌చార్జి గౌరు చరితారెడ్డి నేతృత్వంలో యువనేతకు అపూర్వస్వాగతం లభించింది. కాగా, లోకేశ్ తన 88వ రోజు పాదయాత్రలో 15.9 కిలోమీటర్లు నడిచారు. దీంతో ఇప్పటి వరకు 1,135.6 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది.

అది నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: లోకేశ్
కోడుమూరులో దళితులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రంలో దళితులపై దామనకాండ సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే దుర్మార్గపు ప్రభుత్వం ఇదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే దళితుల్లో ఉన్న 62 ఉపకులాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అలాగే, విదేశీ విద్య పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామన్నారు. జగన్ రద్దు చేసిన పథకాలన్నింటినీ తిరిగి ప్రవేశపెడతామని చెప్పారు. తాను దళితుల్ని అవమానపర్చానని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా  తప్పుకుంటానని, లేకపోతే  సాక్షి మీడియాని మూసేస్తారా అని సవాలు విసిరారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ని చంపేశారని, ఇసుక అక్రమాలపై ప్రశ్నించినందుకు  వరప్రసాద్ కి గుండు కొట్టారని, మాస్క్ వేసుకోలేదని కిరణ్‌ని కొట్టి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News