Go first airlines: సంక్షోభంలో గో ఫస్ట్ ఎయిర్ లైన్స్.. టికెట్ తీసుకున్న వారి పరిస్థితి ఏంటి?

Heres what happens to your money as Go First airline files for bankruptcy
  • టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటున్న కంపెనీ
  • పూర్తి రిఫండ్ ఇస్తామని ప్రతినిధుల ప్రకటన
  • మూడు రోజుల తర్వాత సర్వీసులు నడుస్తాయా? అన్న ఆందోళనలో ప్రయాణికులు 
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ మూడు రోజుల పాటు విమానాలను రద్దు చేసిన విషయం తెలిసిందే! ఈ నెల 3, 4, 5 తేదీలలో గో ఫస్ట్ కంపెనీకి చెందిన విమానాలు నడవట్లేదు. సర్వీసులు అన్నీ రద్దయ్యాయి. ఈ మూడు రోజులకు సంబంధించి టికెట్ బుక్ చేసుకున్న వారు మరో ప్రత్యామ్నాయం చూసుకోవాలని కంపెనీ చెప్పింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, టికెట్ బుక్ చేసుకున్న తమ పరిస్థితి ఏంటని చాలామంది ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీ ఆర్థిక కష్టాలలో చిక్కుకోవడంతో తమ టికెట్ డబ్బులు తిరిగొస్తాయా లేదా అని టెన్షన్ పడుతున్నారు.

ఈ మూడు రోజులలో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్న వారు ఆందోళన పడాల్సిన అవసరంలేదని గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ ప్రతినిధులు వెల్లడించారు. టికెట్ డబ్బులు పూర్తి రిఫండ్ చేస్తామని, కంపెనీ వెబ్ సైట్ లో బుక్ చేసుకున్న కస్టమర్లకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమచేస్తామని తెలిపారు. ఇతరత్రా ఏజెన్సీల ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారు ఆయా ఏజెన్సీలను సంప్రదించాలని సూచించారు.

టికెట్ సొమ్ము వాపస్ ఇచ్చే విషయానికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. కాగా, మూడు రోజుల పాటు సర్వీసులు రద్దు చేసిన గో ఫస్ట్.. ఆ తర్వాతైనా సర్వీసులను పునరుద్ధరిస్తుందా లేదా అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. చౌక ధరలో విమాన ప్రయాణాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చిన ఎయిర్ లైన్స్ కంపెనీ ఇలా ఆర్థిక కష్టాలలో చిక్కుకోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.
Go first airlines
flight ticket
cancellation
ticket money
air ticket

More Telugu News