Nara Lokesh: ఆయన సింగిల్ గా వచ్చి వెళ్లిపోయారు... వైసీపీ వాళ్లు గుంపులుగా హడావుడి చేస్తున్నారు: లోకేశ్

  • కోడుమూరు నియోజకవర్గంలో ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర
  • కోడుమూరులో సభలో రజనీకాంత్ అంశాన్ని ప్రస్తావించిన లోకేశ్
  • కోడుమూరు సభ కేక పుట్టించిందని వ్యాఖ్యలు
  • బాబాయ్ మర్డర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోందని వెల్లడి
  • జగన్ తండ్రిని పొగిడినా తట్టుకోలేడని విమర్శలు
Lokesh slams YCP leaders in Rajinikanth issue

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర 87వ రోజు ఎమ్మిగనూరు, కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగింది. మధ్యాహ్నం భోజన విరామం వరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సాగిన పాదయాత్ర తర్వాత కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి చేరింది. సాయంత్రం కోడుమూరులో నిర్వహించిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్దఎత్తున జనం హాజరయ్యారు. 

ఈ సందర్భంగా లోకేశ్ ప్రసంగిస్తూ... రజనీకాంత్ అంశాన్ని ప్రస్తావించారు. "స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారితో ఉన్న అనుబంధం, చంద్రబాబు గారి విజన్ గురించి మాట్లాడారు. రాజకీయాల గురించి మాట్లాడలేదు. వైసీపీ గురించి అసలే మాట్లాడలేదు. చంద్రబాబు గారి గొప్పతనం గురించి రజనీకాంత్ గారు చెప్పడం చూసి జగన్ టీవీ పగలకొట్టాడట. 

రజనీకాంత్ గారు ఎప్పుడో చెప్పారు... నాన్నా పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుంది అని. ఆయన సింగిల్ గా వచ్చి వెళ్ళిపోయాడు. వైసీపీ వాళ్ళు గుంపులుగా వచ్చి హడావిడి చేస్తున్నారు. ఆయన ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. అందుకే వైసీపీ వాళ్ళు ప్యాంట్లు తడిపేసుకుంటున్నారు" అని ఎద్దేవా చేశారు. 

కేక పుట్టించిన కోడుమూరు!

కోడుమూరు సభ కేక పుట్టించిందని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే జగన్ కి గుండెదడ మొదలవ్వడం ఖాయం అని అన్నారు. "ఉమ్మడి రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన నియోజకవర్గం కోడుమూరు. దళిత వర్గానికి చెందిన దామోదరం సంజీవయ్య గారు కోడుమూరు నుండి గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయ భాస్కర రెడ్డి గారు కోడుమూరు నియోజకవర్గానికి చెందిన వారే. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న కోడుమూరు నేలపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం" అని తెలిపారు. 

బాబాయ్ మర్డర్ కేసు రోజుకో మలుపు!

బాబాయ్ మర్డర్ మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతోందని లోకేశ్ అన్నారు. "మర్డర్ అర్ధరాత్రి 2.30 కి జరిగితే తెల్లవారుజామున 4.30 కి లోటస్ పాండ్ మీటింగ్ లో ఉన్న నలుగురు ముఖ్యమైన వ్యక్తులకు గుండెపోటుతో బాబాయ్ చనిపోయాడు అని చెప్పాడు జగన్. అంటే అప్పటికే కుట్లు వేసి కట్టుకట్టే కార్యక్రమం పూర్తిచేశారు. ఆ మీటింగ్ లో ఉన్న నలుగురిని విచారిస్తే నిజమైన మాస్టర్ మైండ్ దొరికిపోవడం ఖాయం. 

జగన్ అండ్ కో డ్రామాలు చూసిన తరువాత నాకు ఒక కథ గుర్తొచ్చింది. జగన్నాథం అనే ఒక వ్యక్తి ఒక కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అతన్ని పోలీసులు జడ్జ్ గారి ముందు ప్రవేశపెట్టారు. జడ్జ్ గారు ఏమైనా చెప్పుకునేది ఉందా అని జగన్నాథంని అడిగారు. తండ్రి, బాబాయ్ లేని అనాథని దయచేసి నన్ను వదిలిపెట్టండి అని జడ్జ్ గారి ముందు ఏడ్చాడు. జగన్నాథం బాధని చూసి జడ్జ్ గారు కరిగిపోయారు. ఏ పాపం తెలియని ఈ అమాయకుడిని, అనాథని ఎలా అరెస్ట్ చేశారయ్యా అని పోలీసుల్ని ప్రశ్నించారు జడ్జ్ గారు. 

అయ్యా తండ్రిని, బాబాయ్ ని లేపేసింది జగన్నాథమే అని పోలీసులు జడ్జ్ గారితో అన్నారు. అది విన్న జడ్జ్ గారు షాక్ కి గురయ్యారు. జగన్నాథం ఎంత గొప్ప యాక్టరో జడ్జ్ గారికి అర్థమైంది" అని వివరించారు.

తండ్రిని పొగిడినా తట్టుకోలేడు!

జగన్ ది శాడిస్టు స్వభావం అని లోకేశ్ విమర్శించారు. అతన్ని తప్ప వైఎస్ గారిని పొగిడినా తట్టుకోలేడని, అందుకే పేరు మార్చి శాడిస్టు జగన్ అని పెట్టానని వెల్లడించారు. ప్రజల సమస్యలు తీర్చే ప్రజావేదిక కూల్చిన వారిని శాడిస్ట్ అనే అంటాం. ప్రకృతిని విధ్వంసం చేస్తూ రుషికొండకు గుండు కొట్టిన వాడిని శాడిస్ట్ అనే అంటాం. మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఆనంద పడేవాడిని శాడిస్ట్ అనే అంటాం" అని వివరించారు.

మేం సీసీ రోడ్లు వేశాం... నువ్వేం చేశావు పులకేశీ...?

"ఇది ఎమ్మిగనూరు నియోజకవర్గం పుట్టపాశం దళితవాడలో మేం నిర్మించిన సీసీ రోడ్డు తాలూకు శిలాఫలకం. నేను పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన రెండున్నరేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు వేశాను. నాలుగేళ్ల జగన్ రెడ్డి గారి జమానాలో కొత్త రోడ్ల నిర్మాణం మాట దేవుడెరుగు, గోతుల్లో తట్ట మట్టి పోసే దిక్కులేదు. వర్షం వస్తే రోడ్లు తటాకాలను తలపిస్తున్నాయి. 

రోడ్లు వేయడానికి టెండర్లు పిలచినా జగన్ ముఖం చూసి కాంట్రాక్టర్లు పరారవుతున్నారు. దిక్కుమాలిన పాలనతో జనానికి చుక్కలు చూపిస్తూ రాజుగారి ఒంటిమీద దేవతా వస్త్రాల మాదిరిగా అంతా బాగుందని డబ్బాలు కొట్టించుకోవడం పులకేశి పాలనలో మాత్రమే సాధ్యం" అని లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

దెబ్బతిన్న మునగపంటను పరిశీలించిన లోకేష్

ఎమ్మిగనూరు నియోజకవర్గం గాజులదిన్నెలో అకాలవర్షాల కారణంగా దెబ్బతిన్న మునగపంటను పరిశీలించిన లోకేశ్... రైతు నాగిరెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా రైతు నాగిరెడ్డి తమ గోడు విన్పించారు. రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, పంట నష్ట పరిహారం అందకపోతే వ్యవసాయం కొనసాగించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు ఎటువంటి సాయం అందడంలేదుని తెలిపారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... జగన్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మండిపడ్డారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతే సీఎం జగన్ కి కనీసం సమీక్ష చేసే ఖాళీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. "పంట నష్టం అంచనా కూడా వేసే పరిస్థితి లేదు. టీడీపీ హయాంలో నష్టం అంచనా, పరిహారం సమయానికి అందించాం. ఉన్న క్రాప్ ఇన్స్యూరెన్స్ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి వ్యయం తగ్గించేలా చర్యలు తీసుకుంటాం. భూమి యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేస్తాం" అని హామీ ఇచ్చారు.

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం – 1119.7 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం – 16.9 కి.మీ.*

*88వరోజు (3-5-2023) యువగళం వివరాలు*

*కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గం (కర్నూలు జిల్లా):*

ఉదయం

7.00 - కోడుమూరు శివారు విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

7.15 – కోడుమూరు హంపయ్య సర్కిల్లో బుడగజంగాలతో భేటీ.

7.35 – కోడుమూరు కోట్ల సర్కిల్ లో సర్పంచ్ లతో సమావేశం.

7.45 – కోడుమూరు వెల్దుర్తి రోడ్డులో ఎంఆర్ పిఎస్ నేతలతో సమావేశం.

8.00 – కోడుమూరు మయూరి సెంటర్ లో స్థానికులతో భేటీ.

8.10 – కోడుమూరు విజయభాస్కర్ రెడ్డి కాలనీలో చేనేతలతో సమావేశం.

10.15 – వెంకటగిరి గ్రామస్తులతో మాటామంతీ.

11.20 – వెంకటగిరిలో ఎస్సీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.

మధ్యాహ్నం 

12.20 – వెంకటగిరిలో భోజన విరామం

సాయంత్రం

4.00 – వెంకటగిరి నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.45– చిలబండ క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

5.20 – యర్రదొడ్డి గ్రామస్తులతో సమావేశం.

6.10 – అనుగొండ గ్రామస్తులతో సమావేశం.

6.30 – పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

6.45 –రేమండూరులో స్థానికులతో మాటామంతీ.

6.55 – రేమండూరు విడిది కేంద్రంలో బస.

*******

More Telugu News