Virat Kohli: గంభీర్ పైకి దూసుకెళ్లిన కోహ్లీ.. మ్యాచ్ అనంతరం ఉద్రిక్తత.. వీడియో ఇదిగో!

Gambhir charges at Kohli comes face to face after pushing Rahul
  • లక్నో-బెంగళూరు మ్యాచ్ ముగిశాక ఘటన
  • లక్నో వికెట్ పడిన ప్రతిసారీ రెచ్చిపోయి సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ
  • మ్యాచ్ అనంతరం గంభీర్ వద్దకెళ్లి వాగ్వివాదం
  • విడిపించిన ఆటగాళ్లు
ఐపీఎల్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ కోహ్లీ-గంభీర్ మధ్య వాగ్వివాదానికి కారణమైంది. వీరిద్దరి మధ్య వైరం ఈనాటిది కాదు. 2013లో బెంగళూరు -కోల్‌కతా మ్యాచ్ సందర్భంగా వీరి మధ్య విభేదాలు పొడసూపాయి.

 ఇక, తాజా వివాదం విషయానికి వస్తే, గత నెలలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు-లక్నో మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో బెంగళూరును ఓడించిన తర్వాత లక్నో మెంటార్ అయిన గంభీర్ క్రేజీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. బెంగళూరు ప్రేక్షకుల వైపు చూస్తూ నోటికి తాళాలు వేసుకోమన్నట్టుగా పెదవులపై వేలిని ఉంచాడు. దీనిని కోహ్లీ మనసులో పెట్టుకున్నాడు.

నిన్న లక్నోను సొంతగడ్డపై ఓడించిన కోహ్లీ.. గంభీర్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. బెంగళూరు నిర్దేశించిన 127 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో అతి కష్టం మీద 108 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. లక్నో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగులో కృనాల్ పాండ్యా అవుటయ్యాడు. కృనాల్ క్యాచ్‌ను అందుకున్న కోహ్లీ.. ప్రేక్షకుల వైపు తిరిగి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అంతేకాకుండా వికెట్ పడిన ప్రతిసారీ రెచ్చిపోయి సంబరాలు చేసుకున్నాడు.   

మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో గంభీర్ వద్దకెళ్లిన కోహ్లీ వాగ్వివాదానికి దిగాడు. ఇద్దరూ తీవ్రంగా వాదించుకున్నారు. దీంతో ఆర్సీబీ ఆటగాళ్లు కోహ్లీని సముదాయించి అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో కోహ్లీ కోపంగానే అక్కడి నుంచి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Virat Kohli
Gautam Gambhir
LSG
RCB
Kohli vs Gambhir

More Telugu News