Dengue Virus: భారత్ లో రూపు మార్చుకున్న డెంగీ వైరస్... అర్జంటుగా వ్యాక్సిన్ కావాలంటున్న సైంటిస్టులు

  • ప్రాణాంతక వ్యాధిగా డెంగీ
  • దోమల నుంచి మనుషులకు సంక్రమణ
  • ఓసారి డెంగీ సోకితే యాంటీబాడీలు రెండు మూడేళ్లు ఉంటాయని వివరణ
  • ఆ తర్వాత భిన్న రకాల సీరోటైప్ ల నుంచి రక్షణ ఉండదని వెల్లడి
  • అందుకే వ్యాక్సిన్ తప్పనిసరి అంటున్న పరిశోధకులు
New study on Dengue in India

దోమల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో డెంగీ అత్యంత ప్రమాదకరమైనది. ఒక్కసారిగా రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య పడిపోయి, మనిషి మృత్యుముఖంలోకి వెళతాడు. తాజాగా, పరిశోధకులు ఆందోళనకరమైన అంశాన్ని వెల్లడించారు.

భారత్ లో డెంగీ వైరస్ పరిణామం చెంది కొత్త రూపు దాల్చిందని, దీన్ని కట్టడి చేయాలంటే ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ అవసరమని చెబుతున్నారు. గత 6 దశాబ్దాలుగా దేశంలో నమోదైన డెంగీ వైరస్ డేటాను విశ్లేషించి ఈ మేరకు వివరాలు తెలిపారు. ఈ అధ్యయనంలో పలు సంస్థలు పాలుపంచుకున్నాయి. డెంగీ కేసులు గత 50 ఏళ్లుగా నిలకడగా పెరుగుతున్నాయని పరిశోధకులు వివరించారు. ముఖ్యంగా, ఆగ్నేయాసియా దేశాల్లో డెంగీ ప్రభావం అధికంగా ఉందని వెల్లడించారు. 

అధ్యయనంలో భాగంగా పరిశోధకులు డెంగీ వైరస్ కు చెందిన నాలుగు సీరోటైప్ లపై పరిశీలన చేపట్టారు. తమ పూర్వ వేరియంట్లతో పోల్చితే ఈ సీరోటైప్ లు ఎంత మేర రూపాంతరం చెందాయన్నది పరిశోధించారు. ఈ పరిశోధన వివరాలను ఓ సైన్స్ జర్నల్ లో ప్రచురించారు. 

ఐఐఎస్ సీ పరిశోధకులు భారతీయ డెంగీ స్ట్రెయిన్ ల నుంచి 408 జెనెటిక్ సీక్వెన్స్ లను పరిశీలించారు. ఈ సీక్వెన్స్ లు 1956 నుంచి 2018 మధ్య కాలంలో సేకరించినవి. 

అయితే, ఈ సీక్వెన్స్ లు ఓ క్రమ పద్ధతిలో కాకుండా చాలా సంక్లిష్టంగా మార్పు చెందాయని ఓ పరిశోధకుడు వెల్లడించారు. చాలామంది ఒక సీరోటైప్ ఇన్ఫెక్షన్ కు గురయ్యాక, వారిలో మరో సీరోటైప్ ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడుతున్నట్టు గుర్తించినట్టు పరిశోధక వివరాల రచయిత సూరజ్ జగ్తాప్ తెలిపారు. తద్వారా డెంగీ రోగుల్లో మరింత తీవ్ర లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. 

మొదటి సీరోటైప్ కు, రెండో సీరోటైప్ కు మద్య ఏకరూపత ఉంటే... రక్తంలోని యాంటీబాడీలు సమర్థంగా వాటిని ఎదుర్కొంటాయని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడ్డారు. అయితే, ఓసారి డెంగీ వచ్చాక శరీరంలో తయారైన యాంటీబాడీలు రెండు మూడేళ్ల వరకు అన్ని రకాల సీరోటైప్ ల నుంచి రక్షణ ను అందిస్తాయని, కానీ ఆ తర్వాత యాంటీబాడీల స్థాయులు క్రమంగా తగ్గుతూ వస్తాయని తెలిపారు. 

దాంతో భిన్నరకాల సీరోటైప్ ల నుంచి రక్షణ కొరవడుతుందని వివరించారు. అందుకే డెంగీని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ముఖ్యం అన్న విషయాన్ని తాజా పరిశోధనలు ఎత్తిచూపుతున్నాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

More Telugu News