Karnataka: కర్ణాటక ఎన్నికలపై ఈసీ సమీక్ష.. సహకరిస్తామన్న తెలంగాణ సీఎస్

  • తెలంగాణ, ఏపీ సహా ఆరు దక్షిణాది రాష్ట్రాలతో ఈసీ సమావేశం
  • ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని సూచన
  • నగదు, అక్రమ మద్యం తరలింపు నిరోధంపై తీసుకున్న చర్యలు వివరించిన సీఎస్
EC pushes for greater vigil at inter state border to prevent entry of cash drugs

ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సమావేశం నిర్వహించింది. దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రాలు... తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సమావేశం నిర్వహించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఇతర ఎన్నికల కమిషనర్లు పాల్గొన్నారు. తెలంగాణ నుండి సీఈవో వికాస్ రాజ్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ఏపీ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీఈవో ముఖేష్ కుమార్ మీనా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ పాల్గొన్నారు.

ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు చేసిన ఏర్పాట్లను ఈసీ సమీక్షించింది. సరిహద్దు రాష్ట్రాల నుండి అక్రమంగా తరలించే నగదు, మద్యం తదితరాలను అరికట్టేందుకు చెక్ పోస్టులు, పెట్రోలింగ్ పెంచాలని ఆదేశించింది. ఫ్లయింగ్, మొబైల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసి బోగస్ ఓటర్లను పరిశీలించాలని తెలిపింది. పోలింగ్ కు ముందు చివరి 72 గంటల సమయంలో కర్ణాటక సరిహద్దుల జిల్లాల నుండి ప్రజలు తరలి వచ్చే అవకాశమున్నందున నిఘా పెంచాలని సూచించింది.

ఎన్నికలకు తెలంగాణ తరఫున అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని సీఎస్‌ శాంతికుమారి హామీ ఇచ్చారు. పోలీస్‌, ఎక్సైజ్‌శాఖల ఆధ్వర్యంలో చెక్‌పోస్టులు పెంచనున్నట్లు డీజీపీ తెలిపారు. సరిహద్దుల్లో నగదు, అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు, ఇతర వస్తువుల తరలింపు నిరోధానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీఎస్ వివరించారు.

More Telugu News