Faf duPlessis: మళ్లీ ఆర్సీబీ కెప్టెన్ గా డుప్లెసిస్... ముగిసిన కోహ్లీ టెంపరరీ బాధ్యతలు 

Faf duPlessis takes skipper charges after recovery
  • నేడు ఐపీఎల్ లో ఆర్సీబీ వర్సెస్ లక్నో
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
  • లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో మ్యాచ్
  • పూర్తి ఫిట్ నెస్ సంతరించుకున్న డుప్లెసిస్
ఐపీఎల్ లో ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏకానా స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. 

కాగా, పూర్తి ఫిట్ నెస్ తో ఉన్న ఫాఫ్ డుప్లెసిస్ మళ్లీ ఆర్సీబీ కెప్టెన్ గా నేడు టాస్ కు వచ్చాడు. డుప్లెసిస్ ఫిట్ గా లేకపోవడంతో గత కొన్ని మ్యాచ్ లలో విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలు నిర్వర్తించడం తెలిసిందే. 

ఇక ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ జట్టులో ఫాస్ట్ బౌలర్ జోష్ హేజెల్ వుడ్ కు స్థానం కల్పించారు. షాబాజ్ అహ్మద్ స్థానంలో అనూజ్ రావత్ ను తీసుకున్నామని డుప్లెసిస్ వెల్లడించాడు. అటు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఒక మార్పు జరిగింది. పేసర్ అవేష్ ఖాన్ స్థానంలో కృష్ణప్ప గౌతమ్ జట్టులోకి వచ్చాడు. 

కాగా, ఈ టోర్నీలో లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడి 5 విజయాలు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ తర్వాత రెండో స్థానంలో ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది.
Faf duPlessis
Virat Kohli
Captain
RCB
LSG
IPL

More Telugu News