Revanth Reddy: వెయ్యి కోట్ల అవినీతి జరిగింది.. కేటీఆర్‌ను బొక్కలో తోయించే వరకు పోరాటమే!: రేవంత్ రెడ్డి

  • ఇది కేటీఆర్ దోపిడీ, కాపాడేందుకు వెనుక కేసీఆర్ ఉన్నారన్న రేవంత్
  • నన్ను ఎంపీగా గుర్తించకుంటే, సచివాలయం వద్ద పాస్ తీసుకోమని చెప్పవచ్చునని వ్యాఖ్య
  • కేంద్ర దర్యాఫ్తు సంస్థలకు ఓఆర్ఆర్ లీజుపై ఫిర్యాదు చేస్తామన్న టీపీసీసీ చీఫ్
  • దొంగలతో కలవొద్దని సంస్థకు రేవంత్ రెడ్డి వార్నింగ్
Revanth Reddy alleges crores of rupees in orr lease

ఓఆర్ఆర్ లీజులో వెయ్యికోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఈ దోపిడీ వెనుక కేటీఆర్ ఉన్నారని, ఆయనను కాపాడేందుకు వెనుక కేసీఆర్ ఉన్నారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాదు, మాసాబ్ ట్యాంకులోని హెచ్ఎండీఏ కార్యాలయంలో ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు అంశానికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఓఆర్ఆర్ ను కేటీఆర్, కేసీఆర్ తెగనమ్ముకున్నారని ధ్వజమెత్తారు. ఈ అంశంపై తాను ఎంపీగా సచివాలయానికి వెళ్తే తప్పేమిటని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా తాను వెళ్లవచ్చునని చెప్పారు. కానీ కేటీఆర్ అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని తనను పోలీసులతో అడ్డుకున్నారని ఆరోపించారు. కనీసం తనను ఎంపీగా గుర్తించలేకుంటే, సచివాలయం వద్దకు వెళ్లాక సాధారణ పౌరుల్లా పాస్ తీసుకొని వెళ్లమని చెప్పి ఉండవచ్చు కదా అని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ లీజులో వెయ్యి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. 

హెచ్ఎండీఏ కమిషనర్ కు ఫిర్యాదు చేయాలని తాను సచివాలయానికి వెళ్తే, హెచ్ఎండీఏ కార్యాలయం ఇక్కడ లేదంటూ తనను మాసాబ్ ట్యాంకులోని పాత కార్యాలయానికి తీసుకు వెళ్లారని, తీరా అక్కడకు వెళ్లాక మొత్తం సచివాలయం షిఫ్ట్ అయినట్లు చెప్పారన్నారు. తనను సచివాలయంకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికం అన్నారు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. నక్సలైట్లను కూడా ఇలా అడ్డుకోరన్నారు. మాసాబ్ ట్యాంకు కార్యాలయంలో కమిషనర్, అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్ ఎవరూ లేరని, సెక్షన్ ఆఫీసర్ వచ్చి తన నుండి వినతి పత్రం తీసుకున్నారన్నారు. వినతి పత్రం ముట్టినట్లు స్టాంప్ వేసివ్వమంటే కూడా ఆఫీస్ అంతా అక్కడకు వెళ్లిందని సంతకం చేసిచ్చాడన్నారు.

ఓఆర్ఆర్ దోపిడీపై కేంద్ర దర్యాఫ్తు సంస్థలైన సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. దీనిని అన్యాక్రాంతం కానిచ్చేది లేదన్నారు. కేటీఆర్ ను బొక్కలో తోయించే వరకు పోరాడుతామన్నారు. మూడు నెలల్లో దిగిపోయే వాడు 30 ఏళ్ల కాంట్రాక్టును అక్రమంగా ఇస్తే ఊరుకునేది లేదన్నారు. తాను ఓఆర్ఆర్ తీసుకునే సంస్థకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నానని, కేటీఆర్ తో, దొంగలతో కలిసి చేరితే మీకు ఇబ్బందులు తప్పవన్నారు.

More Telugu News