Drinkers: 300 మంది తాగుబోతు పోలీసులకు వీఆర్ఎస్ ఇచ్చిన అసోం ప్రభుత్వం

  • పోలీసుల్లో తాగుబోతులపై అసోం ప్రభుత్వం కఠినచర్యలు
  • మద్యం వ్యసనంగా మారిన పోలీసులను గుర్తించిన ప్రభుత్వం
  • తాగుబోతు పోలీసులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలు
  • తొలగింపునకు గురైన వారిలో కానిస్టేబుళ్లు, ఆఫీసర్లు
Assam govt gives VRS to habitual drinkers in Police dept

పోలీసు వ్యవస్థ లేకపోతే ప్రజల భద్రత ఎలా ఉంటుందో తలచుకుంటేనే వణుకుపుడుతుంది. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే గాడి తప్పినా ప్రతికూల పరిస్థితులు తప్పవు. సరిగ్గా ఈ అంశంపైనే అసోం ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర పోలీసుల్లో మద్యం ఓ వ్యసనంగా మారిన వారిని గుర్తించి, వారిని సాగనంపింది. 

మందులేనిదే ఉండలేని స్థితికి వచ్చి, మద్యానికి బానిసలైన 300 మంది పోలీసులకు అసోం రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) ఇచ్చింది. మీరూ వద్దు... మీ సేవలూ వద్దు అంటూ వారిని ఇంటికి పంపింది. మద్యం వ్యసనపరులు ఎవరైనా పోలీసు విభాగంలో ఉంటే వారికి వీఆర్ఎస్ ఇచ్చి పంపిస్తామని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. 

కాగా, బలవంతపు వీఆర్ఎస్ అందుకున్న వారిలో కానిస్టేబుళ్లే కాదు, కొందరు ఆఫీసర్లు కూడా ఉన్నారట. తొలగింపునకు గురైన పోలీసుల్లో వివిధ హోదాల్లో ఉన్న పోలీసులు ఉన్నారని, విపరీతంగా తాగి ఒళ్లు గుల్ల చేసుకున్నారని, వారి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని సీఎం తెలిపారు. వారి స్థానంలో కొత్తవారిని తీసుకునే రిక్రూట్ మెంట్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వెల్లడించారు. 

అసోంలో హోంమంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మే పర్యవేక్షిస్తున్నారు.

More Telugu News