tuni train burning case: ముద్రగడ, దాడిశెట్టి రాజా, సినీ నటుడు జీవీలకు ఊరట: తుని రైలు దగ్ధం కేసు కొట్టివేత

Tuni train fire case dismissed by Vijayawada Railway Court
  • తుని రైలు దగ్ధం కేసులో 41 మందిపై కేసు
  • సాక్ష్యాలు లేవంటూ కేసును కొట్టి వేసిన రైల్వే కోర్టు
  • ఆర్ఆర్ఎఫ్ పోలీసులు దర్యాప్తు సరిగ్గా చేయలేదని వ్యాఖ్య
  • సున్నితమైన అంశాన్ని ఇన్నేళ్లు ఎందుకు సాగదీశారని ప్రశ్న
తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు సోమవారం కొట్టి వేసింది. ముగ్గురు ఆర్ఆర్ఎఫ్ పోలీసులు దర్యాప్తు సరిగా చేయలేదని పేర్కొంది. 2016 జనవరి 30వ తేదీన కాపు నాడు సభ సమయంలో రైలు దగ్ధమైంది. ఎనిమిదిన్నరేళ్ల తర్వాత... ఈ కేసులో సరైన సాక్ష్యాలు చూపించలేదంటూ కోర్టు కొట్టి వేసింది. 

తీర్పు సమయంలో ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, సినీ నటుడు జీవా కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. ఈ ముగ్గురు సహా 41 మంది నిందితులుగా ఉన్నారు. వీరికి క్లీన్ చిట్ వచ్చింది. ఈ సందర్భంగా విజయవాడ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించి సరైన వాదనలు లేకపోవడంతో, సాక్ష్యాలు చూపించకపోవడంతో కేసును కొట్టి వేస్తున్నట్లు చెప్పారు. కోర్టు తీర్పుపై కాపు సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.

తుని రైలు దగ్ధం కేసులో ముగ్గురు రైల్వే పోలీసు అధికారులు దర్యాప్తును సరిగ్గా చేయలేదని వ్యాఖ్యానించింది. వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సున్నితమైన అంశాన్ని అయిదేళ్ల పాటు ఎందుకు సాగదీశారని కూడా ప్రశ్నించింది. అయిదేళ్ళ పాటు కోర్టులో ఎక్కువ మంది సాక్షులను ప్రవేశ పెట్టలేదని తెలిపింది. ఆ రైలులో అంతమంది ప్రయాణిస్తుంటే ఎక్కువ మందిని విచారించలేదని అభిప్రాయపడింది.

ఓ వ్యక్తి రైలులో ప్రయాణించాడని అతనిని కోర్టులో సాక్షిగా ప్రవేశ పెట్టారని, కానీ అతను మాత్రం తాను జర్నీ చేయలేదని చెప్పాడని కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో 41 మందిపై అక్రమ కేసుగా పరిగణించి, కొట్టి వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఇదిలా ఉండగా, పోలీసు విభాగం, గవర్నమెంట్ రైల్వే పోలీసులు నమోదు చేసిన పలు కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తి వేసింది. ఇప్పటి వరకు ఆర్పీఎఫ్ కేసు పెండింగులో ఉంది. ఇప్పుడు రైల్వే కోర్టు కూడా దీనిని కొట్టి వేసింది.
tuni train burning case
railway court
Mudragada Padmanabham

More Telugu News