Revanth Reddy: సెక్రటేరియట్ కు వెళ్లనీయరా... రోడ్డు పైనే కూర్చుంటాను: పోలీసులతో రేవంత్ వాగ్వాదం

  • కొత్త సచివాలయంకి వెళ్తుండగా టీపీసీసీ చీఫ్‌ను అడ్డుకున్న పోలీసులు
  • ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకున్నారనీ, అధికారికి లేఖ ఇచ్చి వెళ్తానని వ్యాఖ్య
  • ససేమీరా అన్న పోలీసులు
  • తాను ఎంపీననీ, ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించిన రేవంత్
  • సచివాలయం పక్కనే కారులో కూర్చొని వేచిచూసిన టీపీసీసీ చీఫ్
Police obstruct Revanth Reddy while going secretariat

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొత్త సచివాలయానికి వెళ్తుండగా టెలిఫోన్ భవన్ వద్ద పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రేవంత్ మధ్య వాగ్వాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేసేందుకు ఆయన సోమవారం మధ్యాహ్నం కారులో సచివాలయానికి బయలుదేరారు. అయితే ఈ విషయం తెలిసిన పోలీసులు ఆయన కారును కొద్ది దూరంలో అడ్డుకున్నారు. సెక్రటేరియట్ విజిటర్స్ గేటును మూసివేశారు. బారీకేడ్లు ఏర్పాటు చేశారు. 

తనను సచివాలయానికి వెళ్లకుండా అడ్డుకోవడంపై రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు తన కారును నిలిపివేయడంతో ఆయన డీసీపీతో ఫోన్ లో మాట్లాడారు. తాను ఎంపీని అని, తనను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. తాను సచివాలయంకు వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. సచివాలయంలోకి అనుమతి మీ చేతుల్లో లేదని, తాము ప్రజాప్రతినిధులమని గుర్తుంచుకోవాలని చెప్పారు. అలాంటప్పుడు తాము సచివాలయానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. 

మీరు నన్ను అడ్డుకుంటే రోడ్డు మీదే కూర్చుంటానని చెప్పారు. తనకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. తాను సచివాలయంలో ఓ అధికారిని కలిసేందుకు వెళ్తున్నానని, అలాంటప్పుడు తనను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకున్నారని, ఈ అంశంపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు తెలుసుకోవడానికి అడిగేందుకు వెళ్తున్నానని చెప్పారు. తాను పర్సనల్ వ్యక్తులను కలిసేందుకు వెళ్లడం లేదని, అధికారిని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పారు.

తానేం ధర్నా చేయడానికి, నిరసన తెలపడానికి వెళ్లడం లేదని, సమాచార హక్కు చట్టం కింద వివరాలు తెలుసుకోవడానికి వెళ్తుంటే అడ్డుకొని దౌర్జన్యం చేస్తున్నారని చెప్పారు. తన కారులో వెళ్లడం వారికి ఇబ్బందిగా అనిపిస్తే పోలీసులు వారి కారులోనే తనను అధికారి వద్దకు తీసుకెళ్లవచ్చునని చెప్పారు. తాను ఆఫీస్ టైమ్ లోనే వెళ్తున్నానని చెప్పారు. అయితే అనుమతి ఇస్తారా లేదా తెలుసుకొని చెబుతానని పోలీసులు చెప్పగా... అప్పటి వరకు ఇక్కడే ఉంటానని సచివాలయం సమీపంలోనే కారు ఆపుకొని కూర్చున్నారు రేవంత్.

More Telugu News