World Economic Forum: ఐదేళ్లలో కోటిన్నర ఉద్యోగాలు పోతాయట.. రిస్క్ లో ఉన్న ఉద్యోగాలివే!

World Economic Forum suggests that in the next five years 1 crore and 40 lakhs jobs could vanish
  • ఫ్యూచర్ జాబ్స్ రిపోర్టు 2023ని రిలీజ్ చేసిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్  
  • వచ్చే ఐదేళ్లలో 10 శాతం ఉద్యోగాల పెరుగుదల నమోదవుతుందని వెల్లడి
  • 12.30 శాతం పాత ఉద్యోగాలు పోతాయని అంచనా
  • క్యాషియర్లు, క్లర్క్ లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల జాబ్స్ పై ప్రభావం ఎక్కువ ఉండొచ్చని రిపోర్టు
టెక్నాలజీ పెరిగే కొద్దీ జనజీవనం మెరుగవుతోంది. మౌలిక వసతులు పెరుగుతున్నాయి. అంతా సులభమైపోతోంది. డబ్బులు వెయ్యాలంటే బ్యాంకుకే వెళ్లాల్సిన పని లేదు.. చేతిలో ఫోన్, దానిలో నెట్ ఉంటే సరిపోతుంది. ఇది నాణేనికి ఒకవైపు!

పెరుగుతున్న టెక్నాలజీ ఉద్యోగాలపై భారీగా దెబ్బకొడుతోంది. వ్యవసాయం మొదలుకొని ప్రతి రంగంపై ఈ ఎఫెక్ట్ పడుతోంది. సాధారణ కూలీలే కాదు.. స్కిల్డ్ లేబర్లు కూడా ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆన్ లైన్ బ్యాంకింగ్, యూపీఐ వ్యవస్థ వచ్చాక ఎన్నో బ్యాంకులు తమ బ్రాంచ్ లు మూసేశాయి. ఫలితంగా ఉద్యోగాల కోత.. ఇది నాణేనికి మరోవైపు!

కొత్త సాంకేతికత వచ్చే కొద్దీ కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇదే స్థాయిలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. కొత్తగా క్రియేట్ అయ్యే వాటి కంటే.. ఊడుతున్న ఉద్యోగాల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ఈ విషయాన్ని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వెల్లడించింది. ఈ మేరకు ఫ్యూచర్ జాబ్స్ రిపోర్టు 2023ని రిలీజ్ చేసింది. 

వచ్చే ఐదేళ్లలో 10 శాతం ఉద్యోగాల పెరుగుదల నమోదవుతుందని, ఇదే సమయంలో 12.30 శాతం పాత ఉద్యోగాలు పోతాయని అందులో వెల్లడించింది. కొత్తగా 6.9 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని, కానీ 8.3 కోట్ల ఉద్యోగాలు ఊడతాయని వివరించింది. అంటే వచ్చే ఐదేళ్లలో 1.4 కోట్లకు పైగా ఉద్యోగాలు పోతాయని చెప్పింది. 

‘‘ఆన్‌లైన్ బ్యాంకింగ్.. అనేక ఫిజికల్ బ్యాంక్ బ్రాంచ్‌లను మూసివేయడానికి దారితీసింది. ఈ దశాబ్దం ముగిసేలోపు బ్యాంకు టెల్లర్, సంబంధిత క్లర్క్ ఉద్యోగాల్లో 40 శాతం కోత పడొచ్చు. ఏ రంగంలోనైనా ఇదే అత్యధికం’’ అని వివరించింది. 

‘‘ఆటోమేషన్, సెన్సార్ టెక్నాలజీలు, ఆన్ లైన్ సర్వీసుల వల్ల.. పోస్టల్ సర్వీస్ క్లర్క్ లు, క్యాషియర్లు, టికెట్ ఆఫీస్ క్లర్క్ లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. డేటా క్లర్క్ లు, అడ్మినిస్ట్రేటివ్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీలు, అకౌంటింగ్, బుక్ కీపింగ్, పెట్రోల్ క్లర్క్ లపై ప్రభావం ఎక్కువ’’ అని చెప్పింది. 

803 కంపెనీలపై సర్వే చేయగా.. అందులో 300 దాకా కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ టెక్నాలజీలను అడాప్ట్ చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాయని వివరించింది. మరోవైపు నాన్ టెక్నికల్ ఉద్యోగాల్లో పెరుగుదల కనిపిస్తోందని ఈ రిపోర్టు అంచనా వేసింది. హెవీ ట్రక్, బస్ డ్రైవర్లు, ఒకేషనల్ ఎడ్యుకేషన్ టీచర్లు, మెకానిక్ లు, మిషినరీ రిపైర్ చేసే వాళ్ల ఉద్యోగాలు ఎక్కువగా పెరుగుతాయని తెలిపింది.
World Economic Forum
WEF Future of Jobs Report 2023
future job creation
jobs could vanish
decline

More Telugu News