Rahul Gandhi: కర్ణాటకకు మీరు ఏం చేశారో.. ఏం చేస్తారో చెప్పండి.. ఎంత సేపూ మీ గురించేనా?: మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్

Rahul Gandhi hits out at PM in Karnataka says This election is not about modi
  • కాంగ్రెస్ తనను 91 సార్లు తిట్టిందన్న మోదీ ఆరోపణలకు రాహుల్ గాంధీ కౌంటర్
  • కర్ణాటక గురించి మోదీ మాట్లాడరని, కేవలం తన గురించే మాట్లాడుకుంటారని ఎద్దేవా
  • అసెంబ్లీ ఎన్నికలు ఆయన కోసం కాదని, ప్రజల కోసమని వ్యాఖ్య
  • మీరేం చేశారో తర్వాతి ప్రసంగంలోనైనా చెప్పాలంటూ హితవు
కాంగ్రెస్ పార్టీ తనను 91 సార్లు తిట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికలు మోదీ కోసం కాదని, ప్రజల కోసమని, ఆ విషయం ఆయన తెలుసుకోవాలని హితవుపలికారు. 

ఈ రోజు తుమకూరు జిల్లా తురువెకెరెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడారు. ‘‘కర్ణాటక ఎన్నికల ప్రచారానికి మీరు (మోదీ) వస్తారు. కానీ కర్ణాటక గురించి మాట్లాడరు. కేవలం మీ గురించి మాత్రమే మాట్లాడతారు. మూడేళ్లలో మీరు రాష్ట్రానికి ఏం చేశారు? వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తారు? యువత, విద్య, ఆరోగ్యం, అవినీతిపై పోరాటం విషయంలో ఏం చేస్తారనేది చెప్పాలి’’ అని సూచించారు. 

‘‘ఈ ఎన్నికలు మీ కోసం కాదు. కర్ణాటక ప్రజలు, వారి భవిష్యత్తు కోసం. కాంగ్రెస్ మిమ్మల్ని 91 సార్లు తిట్టిందని చెబుతారు. కానీ మీరు రాష్ట్రానికి ఏం చేశారనేది మాత్రం చెప్పరు. కనీసం తర్వాతి ప్రసంగంలోనైనా మీరేం చేశారు? ఏం చేయబోతున్నారు? అనేది చెప్పండి’’ అని ఎద్దేవా చేశారు.

ప్రసంగాల్లో కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తదితరుల పేర్లను ప్రస్తావించడంపై రాహుల్ స్పందిస్తూ.. ‘‘మేం మా నేతల పేర్లను ప్రస్తావిస్తాం. కానీ మీరు (మోదీ) కనీసం మీ ముఖ్యమంత్రి (బసవరాజ్ బొమ్మై), మాజీ ముఖ్యమంత్రి (బీఎస్ యెడియూరప్ప) పేర్లను కూడా ప్రస్తావించరు. మీ స్పీచ్ లన్నీ కేవలం ‘నరేంద్ర మోదీ’ గురించే’’ అని విమర్శించారు. కనీసం ఒకటీ రెండు సార్లయినా బొమ్మై, యెడియూరప్ప పేర్లను ప్రస్తావించాలని, వాళ్లు సంతోషపడతారని సూచించారు.
Rahul Gandhi
Narendra Modi
Karnataka Assembly Elections
BJP
Congress
Siddaramaiah
Basavaraj Bommai
Mallikarjun Kharge

More Telugu News