Yashasvi Jaiswal: పానీ పూరి అమ్మి.. 21 ఏళ్లకే బ్యాటుతో సత్తా చాటుతున్న జైస్వాల్

  • ఉత్తరప్రదేశ్ కు చెందిన జైస్వాల్.. ముంబైలో క్రికెటర్ గా సాధన
  • శిక్షణ తీసుకునే కాలంలో జీవనం కోసం పానీ పూరీ విక్రయాలు
  • అనుకున్నది సాధించాలంటే అంకిత భావం కావాలన్న రాజస్థాన్ బ్యాటర్
How inspirational Yashasvi Jaiswal went from selling pani puris to scoring IPL century

యశస్వి జైస్వాల్.. క్రికెట్ ప్రపంచంలో యువ సంచలనం. వయసు 21 ఏళ్లే. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఓపెనర్ గా అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఎంతటి ప్రమాదకరమైన బౌలర్ అయినా, అంత తేలిగ్గా వికెట్ పారేసుకోకుండా, ఎంతో అనుభవం ఉన్న వాడి మాదిరిగా జైస్వాల్ ఆడుతున్న తీరు సామాన్యులనే కాదు, క్రికెటర్లను సైతం ఆకర్షిస్తోంది. టీ20 అంటే దూకుడుగా ఆడితేనే విజయం సాధిస్తామన్న సూత్రంతో.. అతడు బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోతుంటాడు. అందుకే జైస్వాల్ భవిష్యత్తులో టీమిండియా తరఫున అదరగొడతాడంటూ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్, చెన్నై జట్టు మాజీ ఆటగాడు సురేష్ రైనా సహా పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేయడం గమనార్హం.

ఆదివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన పోరులో జైస్వాల్ 62 బంతుల్లోనే 124 పరుగులు పిండుకోవడం ఒక ఉదాహరణ. నేడు అంత గొప్ప ప్రతిభ చూపిస్తున్న జైస్వాల్, ఈ స్థాయి వరకు రావడం వెనుక చేసిన కృషి కూడా గొప్పగానే ఉందని చెప్పుకోవాలి. ఉత్తరప్రదేశ్ లోని బదోహిలో పుట్టిన జైస్వాల్, పదేళ్ల వయసులో ముంబైకి వచ్చాడు. 50 ఓవర్ల క్రికెట్ లో  డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 2020 అండర్ 19 ప్రపంచకప్ లోనూ అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. తద్వారా ముంబై రంజీ జట్టులో 2019లో చోటు సంపాదించాడు. అతడి ప్రతిభను గుర్తించి రాజస్థాన్ రాయల్స్ జట్టు అవకాశం కల్పించింది.

ఒకప్పుడు ముంబైలోని దాదర్ లో అజాద్ మైదానంలో శిక్షణ కోసం వచ్చి, అక్కడే గ్రౌండ్ సిబ్బందితో కలసి టెంటులో నివసించాడు. జీవన అవసరాల కోసం పానీ పూరీ విక్రయించేవాడు. క్రికెటర్ కావడానికి తన ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోతుందని జైస్వాల్ గతేడాది రంజీట్రోఫీ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. తాను ఇప్పటికీ అదే ఆలోచనతో, అదే విధానానికి కట్టుబడి ఉంటానని, జీవితంలో పెద్దగా మార్పులు చేయలేదని స్పష్టం చేశాడు. ‘‘అనుకున్నది సాధించాలంటే ఎంత కష్టపడాలో, ఎంత అంకిత భావంతో పనిచేయాలో నాకు తెలుసు. నేను అలానే కొనసాగుతాను’’ అని తన సక్సెస్ మంత్రాన్ని అతడు వెల్లడించాడు.

More Telugu News