BJP: ఉచితంగా గ్యాస్ సిలిండర్లు.. ఉమ్మడి పౌరస్మృతి అమలు: కర్ణాటక ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో విడుదల

BJP releases poll manifesto pledges Uniform Civil Code
  • ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
  • అధికారం నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ
  • మేనిఫెస్టో విడుదల చేసిన బీజేజీ జాతీయ అధ్యక్షుడు నడ్డా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం రాష్ట్రంలో మోహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస సభలు, రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను సోమవారం విడుదల చేసింది. 'విజన్ డాక్యుమెంట్' పేరిట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో కీలక హామీలు ఇచ్చింది. మళ్లీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫార్మ్ సివిల్ కోడ్) అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దీని కోసం ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని, దాని సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకుని యూసీసీని అమలు చేస్తామని బీజేపీ తెలిపింది. 

దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్న కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. వీటిని ఉగాది, వినాయక చవితి, దీపావళికి పంపిణీ చేస్తారు. అలాగే, దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్న వారి కోసం 'పోషణ' పథకం అమలు చేస్తామని, ఇందులో భాగంగా ప్రతిరోజూ అర లీటర్ నందిని పాలు, నెలకు 5 కేజీల శ్రీ అన్న- శ్రీ ధాన్యం ఇస్తామని హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఐదేళ్ల కాలానికి రూ. పది వేల ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్టు హామీ ఇచ్చింది. సమాజంలోని అన్ని వర్గాలకు చేరువయ్యే విధంగా తమ మేనిఫెస్టోను రూపొందించినట్టు బీజేపీ పేర్కొంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపు నెరవేర్చినట్టు స్పష్టం చేసింది. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి ఈనెల 10న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, కాంగ్రెస్, జేడీఎస్ లు తమ మేనిఫెస్టోలను ప్రకటించాల్సి ఉంది.
BJP
Karnataka
Assembly Election
manifesto
JP Nadda

More Telugu News