Nagabhushanam: ఈ సర్పంచ్ ఎంత మంచివాడో... చెరువులో చేపలను ఫ్రీగా పంచాడు!

Gollagudem Sarpanch distributes fish at free of cost for his villagers
  • పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన
  • చెరువు లీజుకు తీసుకుని చేపలు పెంచిన గొల్లగూడెం గ్రామ సర్పంచ్
  • బయటి వాళ్లకు చెరువు ఇస్తే పాడుచేస్తున్నారని ఆవేదన
  • అందుకే తానే లీజుకు తీసుకున్న వైనం
  • సహజ విధానాలతో చేపల పెంపకం
  • ఫ్రీగా చేపలు లభించడంతో హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ సర్పంచ్ ఏం చేశాడో తెలిస్తే ఎంత మంచివాడో అనక మానరు. ఆయన పేరు నాగభూషణం. ఆయన ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెం గ్రామ సర్పంచ్. ఆయన తమ గ్రామంలోని చెరువులో చేపలను పట్టి, గ్రామస్తులందరికీ ఒక్క పైసా తీసుకోకుండా ఉచితంగా పంచారు.

తమ గ్రామంలోని చెరువును బయటి వ్యక్తులకు లీజుకు ఇస్తే, వారు చెరువును పాడు చేస్తున్నారని సర్పంచ్ నాగభూషణంలో అసంతృప్తి ఉండేది. దాంతో, చెరువును ఇతరులకు ఇవ్వకుండా బహిరంగ వేలం ద్వారా తానే లీజుకు తీసుకున్నారు. అంతేకాదు, శీలావతి, గడ్డిమోసులు, కట్ల, రూప్ చంద్ చేపలను ఆర్గానిక్ పద్ధతిలో పెంచారు. చెరువు కలుషితం కాని రీతిలో, చేపల పెంపకంలో సహజ విధానాలను పాటించారు. 

చేపలు బాగా పెరగడంతో, వాటిని వలలు వేసి పట్టించారు. సర్పంచ్ నాగభూషణం ఆ చేపలను తమ గ్రామ ప్రజలకు ఫ్రీగా పంపిణీ చేశారు. కొందరికైతే ఇళ్లకు వెళ్లి మరీ చేపలను అందించారు. 

దాంతో గొల్లగూడెం గ్రామ ప్రజలు ఆరోగ్యవంతమైన తాజా చేపలను వండుకుని లాగించేశారు. అంత మంచి చేపలను తమకు ఉచితంగా ఇచ్చిన సర్పంచ్ నాగభూషణంకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ నాగభూషణం ఇలా చేపలను ఉచితంగా పంచడం ఇదే మొదటిసారి కాదు. ఆయన గతేడాది కూడా ఇలాగే చేపలను ఉచితంగా పంపిణీ చేశారు.
Nagabhushanam
Sarpanch
Fish
Free
Gollagudem
West Godavari District

More Telugu News