wrestlers: ఆ రెజ్లర్లంతా నన్ను పొగిడేవాళ్లు.. నా ఆశీర్వాదం కోరేవాళ్లు: బ్రిజ్ భూషణ్​

Before their protest  they used to praise me seek my blessings says Brij bhushan
  • వాళ్లు రోజుకో డిమాండ్ చేస్తున్నారన్న రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు
  • తాను నేరం చేయలేదనీ, పదవికి రాజీనామా చేసే ఉద్దేశం లేదని స్పష్టీకరణ 
  • ఆందోళన చేస్తున్న రెజ్లర్ల వెనుక ఒకే కుటుంబం ఉందని విమర్శ
తనకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లింగ్ క్రీడాకారులపై భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శరణ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెజ్లర్లు రోజుకో కొత్త డిమాండ్ చేస్తున్నారని అన్నారు. తొలుత తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారని, ఇప్పుడు తనను జైలుకు పంపించాలనీ, పదవుల నుంచి తప్పించాలని అంటున్నారని చెప్పారు. 

తనపై ఎఫ్ ఐఆర్ నమోదైనప్పటికీ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ఉద్దేశం లేద‌న్నారు. రాజీనామా పెద్ద విష‌యం కాదన్న బ్రిజ్ భూషణ్.. ఒకవేళ తాను పదవి నుంచి తప్పుకుంటే నేరాన్ని అంగీకరించినట్టు అవుతుందన్నారు. మరో 45 రోజుల్లో రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని, ఆ ఎన్నిక‌ల త‌ర్వాత త‌న పదవీకాలం ముగుస్తుందని బ్రిజ్ తెలిపారు. ఒక అకాడ‌మీకి చెందిన ఒక కుటుంబం నిర‌స‌న‌లు చేప‌డుతోంద‌ని, హ‌ర్యానాకు చెందిన 90 శాతం మంది అథ్లెట్లు త‌న‌తోనే ఉన్నార‌ని తెలిపారు. 

‘గ‌డిచిన 12 ఏళ్ల నుంచి రెజ్ల‌ర్లు నాపై ఏ పోలీసు స్టేష‌న్‌లో కూడా ఒక్క ఫిర్యాదు చేయ‌లేదు. క్రీడా మంత్రిత్వ‌శాఖ‌కు కానీ, స‌మాఖ్య‌కు కానీ ఫిర్యాదు ఇవ్వలేదు. నాలుగు నెలల కిందట నిర‌స‌న చేప‌ట్ట‌డానికి ముందు ఆ రెజ్ల‌ర్లు నన్ను ప్రశంసించేవారు. వారి వివాహ వేడుకలకు ఆహ్వానించేవారు. నాతో ఫొటోలు దిగి, నా ఆశీర్వాదం తీసుకునేందుకు పోటీపడేవారు’ అని బ్రిజ్ వెల్లడించారు. ఇప్పుడు విషయం సుప్రీంకోర్టు, ఢిల్లీ పోలీసుల చేతుల్లో ఉంద‌న్నారు. వారి నిర్ణ‌యాల‌కు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని బ్రిజ్ స్పష్టం చేశారు.
wrestlers
WFI
Protest
mp
Brij bhushan

More Telugu News