Sperm Donation: వీర్యదానంతో సుమారు 550 మందికి తండ్రయిన వ్యక్తి.. ‘ఇక చాలు ఆపు’ అంటూ కోర్టు ఆదేశం! ఎందుకంటే..

Sperm Donor Who Fathered Over 550 Children Ordered To Stop By Dutch Court
  • వీర్యదానంతో సుమారు 550 మందికి జన్మనిచ్చిన వ్యక్తి
  • సంతానం లేని వారిని మోసపుచ్చి వీర్యదానం చేశాడంటూ నిందితుడిపై నెదర్‌ల్యాండ్స్‌లో కేసు
  • భవిష్యత్తులో వీర్యదానం చేపట్టకుండా నిందితుడిపై కోర్టు నిషేధం
వీర్యదానంతో సుమారు 550 మందికి తండ్రయిన ఓ వ్యక్తి ఇకపై స్పెర్మ్ డొనేషన్ చేయకూడదంటూ నెదర్‌ల్యాండ్స్‌ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. తాను గతంలో పలుమార్లు వీర్యదానం చేశానన్న విషయాన్ని దాచి పెట్టిన నిందితుడు సంతానం లేనివారిని మోసం చేసినట్టు తేలడంతో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా, అతడికి రూ.90 లక్షలకు పైగా జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. నిందితుడు జానథన్ జేకబ్ మేజిర్(41)పై ఓ మహిళ, మరో సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకులు వేసిన కేసులో కోర్టు ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. 

జానథన్ చేసిన పనికి న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. ‘‘గతంలో వీర్యదానంతో తను అనేక మందికి తండ్రయిన విషయాన్ని నిందితుడు దాచిపెట్టాడు. దీంతో, వందల మంది వ్యక్తులు తాము ఒకరికొకరు తోడబుట్టిన వారయ్యే పరిస్థితి దాపురించింది’’ అని వ్యాఖ్యానించారు. జానథన్ ఇప్పటివరకూ 13 సంతాన సాఫల్య కేంద్రాల్లో వీర్యదానం చేసినట్టు వెలుగులోకి వచ్చింది. వీటిల్లో 11 కేంద్రాలు నెదర్‌ల్యాండ్స్‌లోనే ఉన్నాయి. 2007 నుంచి అతడు వీర్యదానం చేస్తున్నాడు. నెదర్‌ల్యాండ్స్ చట్టాల ప్రకారం, ఒక పురుషుడు 12 కంటే ఎక్కువ మంది మహిళలకు వీర్యదానం చేయకూడదు. 25 మందికి మించి పిల్లలకు తండ్రవకూడదు. తమకు వందల మంది తోబుట్టువులు ఉన్నారన్న విషయం పిల్లలు పెద్దయ్యాక తెలిస్తే మానసిక సమస్యలు తలెత్తొచ్చని ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. 

కాగా, కోర్టు తీర్పుపై బాధిత మహిళ హర్షం వ్యక్తం చేసింది. నిందితుడిని అడ్డుకోకపోయి ఉంటే, అతడి చర్యలు ‘కార్చిచ్చు’ లాగా ప్రపంచమంతా వ్యాపించి ఉండేవని వ్యాఖ్యానించింది. అయితే, జానథన్ మొత్తం ఎంతమందికి తండ్రయ్యాడనేది ఇంకా తేలాల్సి ఉంది.
Sperm Donation

More Telugu News