Chandrababu: ఎన్టీఆర్‌కు భారతరత్న అడుగుతూనే ఉంటాం... రజనీకాంత్ షూటింగ్ రద్దు చేసుకొని వచ్చారు: చంద్రబాబు

  • రాజకీయాల్లో క్రమశిక్షణ ఎలా ఉండాలో ఎన్టీఆర్ చూపించారన్న టీడీపీ అధినేత
  • ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా గుర్తుండేలా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు
  • భారత రత్న కోసం ఢిల్లీకి తీర్మానం చేసి పంపిస్తామన్న బాబు
  • బాలకృష్ణ, రజనీకాంత్ లపై ప్రశంసలు
Chandrababu demands Bharata Ratna for NTR

 ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదని, శక్తి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ప్రారంభ సభలో చంద్రబాబు ప్రసంగించారు.  ఎన్టీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ స్ఫూర్తి ఉంటుందన్నారు. ఎన్టీఆర్ తనకు తానే సాటి అన్నారు. ఆయన లాంటి నటుడు, నాయకుడు రావాలంటే ఆయనే మళ్లీ పుట్టాలన్నారు. 

రాజకీయాల్లో ఎలా క్రమశిక్షణతో ఉండాలో ఎన్టీఆర్ ఆచరించి చూపించారన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదని, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం సొంత పార్టీ పెట్టారన్నారు. దేశ రాజకీయాల పైన కూడా ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని చంద్రబాబు పేర్కొన్నారు.

ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా గుర్తుండేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరును పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని, ఈ మేరకు ఢిల్లీకి తీర్మానం పంపిస్తామని చెప్పారు. ఆయనకు భారతరత్న ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటామన్నారు. 

స్టాచ్యూ ఆఫ్ ప్రైడ్ పేరుతో ఎన్టీఆర్ విగ్రహం, మెమోరియల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. ఎన్టీఆర్ పేరుతో మెమోరియల్ రూపొందించేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

ఎన్టీఆర్ వారసుడిగా వచ్చిన బాలకృష్ణ సినిమాలతో పాటు రాజకీయాల్లో రాణిస్తున్నారన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందిస్తూ, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని సేవా భావంతో నడిపిస్తున్నారని ప్రశంసించారు. 

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రజనీకాంత్ కు చంద్రబాబు థ్యాంక్స్ చెప్పారు. ఆయనకు జపాన్ సహా వివిధ దేశాల్లో అభిమానులున్నారని గుర్తు చేశారు. మానవత్వం ఉన్న వ్యక్తి దక్షిణాది సూపర్ స్టార్ అన్నారు. రజనీకాంత్ సినిమా షూటింగ్ రద్దు చేసుకొని ఉత్సవాలకు వచ్చారన్నారు.

More Telugu News