New Delhi: ఢిల్లీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ కేసులో యూపీ వ్యక్తి అరెస్ట్

UP man arrested for hoax bomb threat call at Delhi airport
  • నాలుగు రోజుల క్రితం ఇందిరాగాంధీ విమానాశ్రయానికి బెదిరింపు కాల్
  • తప్పుడు సమాచారం ఇచ్చి, ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న 20 ఏళ్ల జకీర్
  • ఫోన్ లొకేషన్ ఆధారంగా గుర్తించి, అరెస్ట్ చేసిన పోలీసులు
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నాలుగు రోజుల క్రితం వచ్చిన బాంబు బెదిరింపు కాల్ కు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. విమానాశ్రయంలో బాంబు ఉందంటూ 20 ఏళ్ల యువకుడు సోమవారం ఉదయం పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి కలకలం రేపాడు. బాంబు ఉందనే విషయం తెలియగానే పోలీసులు విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించారు. కానీ సదరు వ్యక్తి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ తర్వాత గుర్తించారు.

"ఐజీఐ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ కు నాలుగు రోజుల క్రితం పీసీఆర్ కాల్ వచ్చింది. సోమవారం ఫోన్ చేసి విమానాశ్రయంలో బాంబు ఉందని చెప్పాడు. అతనిని నాలుగు రోజుల తర్వాత అరెస్ట్ చేశాం" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 

విమానాశ్రయంలో సోదాలు నిర్వహించగా, అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదని, కాల్ బూటకమని గుర్తించినట్లు చెప్పారు. సదరు యువకుడికి పోలీసులు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. ఫోన్ లొకేషన్ ఆధారంగా అతనిని ఉత్తర ప్రదేశ్ లోని హాపూర్ కు చెందిన ఇరవై ఏళ్ళ జకీర్ గా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
New Delhi
airport

More Telugu News