Jiah Khan: నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో తీర్పు.. నటుడు పంచోలీకి విముక్తి

  • సూరజ్ పంచోలీని నిర్ధోషిగా ప్రకటించిన సీబీఐ ప్రత్యేక కోర్టు
  • పరిమిత సాక్ష్యాల ఆధారంగా దోషిగా గుర్తించలేమన్న జడ్జి
  • కోర్టు తీర్పు పట్ల జియాఖాన్ తల్లి రబియా ఖాన్ అసంతృప్తి
Jiah Khan case verdict Sooraj Pancholi acquitted of suicide abetment charges

బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో పదేళ్ల తర్వాత ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. నటి జియాఖాన్ ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు నటుడు సూరజ్ పంచోలి ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. అతడ్ని ఈ కేసు నుంచి సీబీఐ కోర్టు విముక్తుడిని చేసింది. ‘‘పరిమిత సాక్ష్యాధారాల ఆధారంగా ఈ కోర్టు నిన్ను (సూరజ్ పంచోలి) నిందితుడిగా పరిగణించలేదు. కనుక నిర్ధోషిగా ప్రకటిస్తున్నాం’’అని జడ్జి ఏఎస్ సయ్యద్ తీర్పు చెప్పారు. ఈ సమయంలో సూరజ్ పంచోలి సైతం కోర్టుకు హాజరయ్యాడు. హత్య అంటూ కేసు విచారణను జియాఖాన్ తల్లి జాప్యం చేశారని కోర్టు వ్యాఖ్యానించింది.


జియాఖాన్ 2013 జూన్ 3న ముంబైలోని తన నివాసంలో విగత జీవిగా బయటపడింది. ఆ సమయంలో ఆమె వయసు 25 ఏళ్లు. ఘటన జరిగిన వారం తర్వాత జియా రాసినట్టుగా భావిస్తున్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద సూరజ్ పంచోలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పంచోలీతో తన బంధంపై ఆమె లేఖలో రాసినట్టు, తనను భౌతికంగా, మానసికంగా పంచోలీ వేధించినట్టు పోలీసులు పేర్కొన్నారు. 

కోర్టు తీర్పు పట్ల సంతోషంగా లేనని జియాఖాన్ తల్లి రబియా ఖాన్ అన్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. జియా ఖాన్ మరణించిన ఏడాది తర్వాత ఈ కేసు విచారణను బోంబై హైకోర్టు సీబీఐకి అప్పగించడం గమనార్హం. సీబీఐ విచారణలో లోపాలున్నాయంటూ, ఈ కేసును తిరిగి మొదటి నుంచి విచారణకు ఆదేశించాలంటూ గతేడాది రబియా ఖాన్ బోంబే హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

More Telugu News