Manipur: మణిపూర్ సీఎం పాల్గొనే సభా వేదికను తగలబెట్టిన ఆందోళనకారులు

  • చురచంద్‌పూర్ జిల్లాలో ఘటన
  • చురచంద్‌పూర్‌లో ఇంటర్నెట్ నిలిపివేసి 144 సెక్షన్ విధింపు
  • ఈ రోజు జిమ్ కమ్ స్పోర్ట్స్ సౌకర్యాన్ని ప్రారంభించనున్న సీఎం బీరెన్ సింగ్
 Internet snapped Sec 144 imposed as mob sets ablaze Manipur CMs event venue

మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చురచంద్‌పూర్ జిల్లాలో శుక్రవారం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కార్యక్రమం నిర్వహించాల్సిన వేదికను ఆందోళనకారులు ధ్వంసం చేసి, తగలబెట్టారు. ముఖ్యమంత్రి ఈరోజు జిమ్-కమ్-స్పోర్ట్స్ సౌకర్యాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఆందోళనకారులు వేదికను ధ్వంసం చేసిన తర్వాత చురచంద్‌పూర్‌లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. పోలీసులు 144 సెక్షన్ విధించారు. మరోవైపు సీఎం పాల్గొనాల్సిన వేదిక వద్ద ఆందోళనకారుల గుంపు కుర్చీలు ఇతర ఆస్తులను ధ్వసం చేశారు. కొత్తగా నిర్మించిన జిమ్‌లోని క్రీడా సామగ్రిని కూడా తగులబెట్టారు. స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ గుంపును చెదరగొట్టారు. అప్పటికే వందలాది కుర్చీలు ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో చురచంద్‌పూర్ పరిపాలన జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేసింది. అయితే పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.

కాగా, శుక్రవారం మధ్యాహ్నం బీరేన్ సింగ్ ప్రారంభించనున్న న్యూ లాంకాలోని పిటి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ఆందోళన చేసిన గుంపు పాక్షికంగా తగలబెట్టిందని పోలీసులు తెలిపారు. హింసాకాండ కారణంగా ముఖ్యమంత్రి కార్యక్రమం రద్దయిందా, లేదా అనే విషయాన్ని జిల్లా యంత్రాంగం ఇంకా నిర్ధారించలేదు. కాగా, బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చిత్తడి నేలలతో పాటు రిజర్వ్, రక్షిత అటవీ ప్రాంతాలను సర్వే చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్, ఈ మూక హింసకు నాయకత్వం వహించినట్లు తెలుస్తోంది.

More Telugu News