Mallikarjun Kharge: మోదీని 'విషసర్పం'తో పోల్చి ఆ తర్వాత "తూచ్" అన్న ఖర్గే

  • మోదీపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ చీఫ్
  • మోదీ విషపూరితమో, కాదో చెప్పాలన్న ఖర్గే
  • నాకితే చాలు... చచ్చిపోతారంటూ వ్యాఖ్యలు
  • ఖర్గేపై భగ్గుమన్న బీజేపీ నేతలు
  • తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చిన ఖర్గే
  • తాను మోదీని అనలేదని, బీజేపీని అన్నానని వెల్లడి
Kharge terms Modi a poisonous snake and later regretted

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ ఒక విషసర్పం లాంటి వాడని విమర్శించారు. "మోదీ విషపూరితమో, కాదో మీరో ఆలోచించాలి. మీరు నాకి--తే చాలు... చచ్చిపోతారు" అంటూ ఖర్గే వ్యాఖ్యానించారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కలబుర్గి వద్ద జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రచారసభలో ఖర్గే కూడా పాల్గొన్నారు. ఖర్గే వ్యాఖ్యలు బీజేపీ నాయకుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రగిల్చాయి. 

ప్రధాని మోదీని ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసహనంలో ఉందని, అందుకే ఆ పార్టీ నేతల నుంచి ఇలాంటి ఆలోచన ధోరణులు పుట్టుకొస్తున్నాయని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు. అసలు, ఖర్గే మనసులోనే విషం ఉందని, మోదీ అన్నా, బీజేపీ అన్నా ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. 

రాజకీయంగా మోదీతో పోటీ పడలేకపోతున్నారని, అందుకే ఇలాంటి నిరాశానిస్పృహలతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ నావ మునిగిపోతుండడం వారు స్వయంగా చూస్తున్నారని, కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. 

కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం ఖర్గే వ్యాఖ్యలపై స్పందించారు. మోదీ ఇతరుల జీవితాలతో ఆడుకునే వ్యక్తి అని గతంలో సోనియా గాంధీ వ్యాఖ్యానించారని, ఆమె వ్యాఖ్యల కంటే ఖర్గే చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని ఠాకూర్ పేర్కొన్నారు. 

కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, కేంద్రమంత్రి శోభా కరంద్లాజే కూడా ఖర్గే వ్యాఖ్యలపై స్పందించారు. సీనియర్ నేత అయివుండి ఇలాంటి భాష మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, తన వ్యాఖ్యల పట్ల తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్టు పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే, అందుకు తనను మన్నించాలని కోరారు. 

మోదీ గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడం తన ఉద్దేశం కాదని, తాను బీజేపీని ఉద్దేశించి విషసర్పం అన్నానని ఖర్గే వివరణ ఇచ్చారు. కానీ తన వ్యాఖ్యలను మోదీకి ఆపాదించారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్-బీజేపీ భావజాలం విషపూరితం అనేది తన ఉద్దేశం అని ఖర్గే స్పష్టం చేశారు.

More Telugu News