Kodi katti Case: కోడికత్తి కేసు విచారణ మే 10కి వాయిదా

kodikatthi case hearing adjourned to may 10
  • నిందితుడు శ్రీనివాస్‌ ను రాజమండ్రి జైలు నుంచి వీడియో కాల్‌ లో విచారించిన ఎన్ఐఏ కోర్టు
  • ఈ కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి ఇటీవల కడప జిల్లాకు బదిలీ
  • ఇంకా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టని తాత్కాలిక న్యాయమూర్తి
  • మే 10న విచారణ జరుపుతానని ఆదేశాలు
వైఎస్ జగన్ పై జరిగిన కోడికత్తి దాడి కేసు విచారణ మే 10వ తేదీకి వాయిదా పడింది. నిందితుడు శ్రీనివాస్‌ ను రాజమండ్రి జైలు నుంచి వీడియో కాల్‌ లో ఎన్ఐఏ కోర్టు విచారించింది. పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసును విచారణ జరుపుతానని చెబుతూ తాత్కాలిక న్యాయమూర్తి వాయిదా వేశారు.

కోడికత్తి కేసుకు సంబంధించి ప్రధానంగా సీఎం జగన్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. తాను కోర్టుకు హాజరు కాలేనని, అడ్వకేట్ కమిషనర్‌ను ఏర్పాటు చేసి విచారించాలని కోరారు. దీనిపై ఇప్పటికే నిందితుడి తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవాళ వాదనలు జరగాల్సి ఉంది.

మరో పిటిషన్ కూడా జగన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఎన్ఐఏ పూర్తి స్థాయిలో విచారణ జరపలేదని, పూర్తి స్థాయిలో మరోసారి విచారణ చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ రెండు పిటిషన్లపై ఈరోజు విచారణ జరుగుతుందని అంతా భావించారు. 

అయితే ఈ కేసును ఇన్నాళ్లూ విచారించిన న్యాయమూర్తి ప్రమోషన్‌పై కడప జిల్లా కోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన తాత్కాలిక న్యాయమూర్తి ఇంకా పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించలేదు. పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించిన తర్వాత విచారణ జరుపుతానని పేర్కొంటూ కేసును మే 10వ తేదీకి వాయిదా వేశారు.
Kodi katti Case
Srinivas
Jagan
NIA Court
Video Call

More Telugu News