Mahesh Babu: మహేశ్-త్రివిక్రమ్ చిత్రంపై కథనాలు... స్పందించిన నిర్మాత నాగవంశీ

Producer Naga Vamsy reacts to speculations on SSMB28
  • త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు 28వ చిత్రం
  • త్రివిక్రమ్ కొత్త షెడ్యూల్ పై క్లారిటీ ఇవ్వలేదంటూ కథనాలు
  • దాంతో మహేశ్ బాబు సమ్మర్ టూర్ ప్లాన్ చేశాడని ప్రచారం
  • నిర్మాతలు మహేశ్ బాబును కలిశారంటూ వార్తలు
  • గాసిప్ రాయుళ్లు సినిమాలు తీస్తే బాగుండునన్న నాగవంశీ
మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా పట్టాలెక్కింది. అయితే, అనూహ్య రీతిలో ఈ సినిమా తాజా షెడ్యూల్ నేపథ్యంలో కొన్ని కథనాలు వెలువడ్డాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త షెడ్యూల్ పై స్పష్టత ఇవ్వకపోవడంతో మహేశ్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వెళుతున్నాడన్నది ఈ వార్తల సారాంశం. 

మహేశ్ బాబు విహార యాత్రకు వెళుతున్నాడని తెలిసి, చిత్ర నిర్మాతలు ఆయన వద్దకు వెళ్లారని, తాజాగా షెడ్యూల్ పై త్రివిక్రమ్ నుంచి క్లారిటీ తీసుకురావాలని మహేశ్ బాబు వారిని కోరగా, వారు వారం రోజుల సమయం అడిగినట్టు ఈ కథనాల్లో పేర్కొన్నారు. వారం సమయం అడుగుతున్నారు కదా.... ఈ లోపు నేను టూర్ కు వెళ్లొస్తా అని మహశ్ బాబు టేకాఫ్ కు సిద్ధమైనట్టు ఆ కథనాల్లో వివరించారు.
 
ఈ ప్రచారంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. ఇలాంటి పుకార్లు పుట్టించేవాళ్లు సినిమాలు తీస్తే బాగుండునని, కనీసం సినిమా ఇండస్ట్రీకైనా ప్రయోజనం చేకూరుతుందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఎస్ఎస్ఎంబీ28 కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలన్న ఉద్దేశంతో తాము పనిచేస్తున్నామని, ఇందులో మరో మాటకు తావులేదని స్పష్టం చేశారు. అయితే, ఇతరులు ఇందులో జోక్యం చేసుకోకుండా, తమ మానాన తమను ప్రశాంతంగా పనిచేసుకోనిస్తే బాగుంటుందని హితవు పలికారు. 

2024 జనవరిలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించామని, ఆ విషయం గుర్తుంచుకోవాలని నాగవంశీ పేర్కొన్నారు. ఇదేం ఆషామాషీగా చేస్తున్న ప్రకటన కాదని గమనించాలని స్పష్టం చేశారు. 

అంతేకాదు, మహేశ్ బాబు ఫ్యాన్స్ ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ... "అభిమానులూ... ఇప్పటికే మీరు మహేశ్ బాబు ఫస్ట్ లుక్ ను ఇష్టపడ్డారు... మే 31న వచ్చే అప్ డేట్ కోసం వేచిచూడండి" అని పిలుపునిచ్చారు.
Mahesh Babu
Trivikram Srinivas
SSMB28
Nagavamsy
Tollywood

More Telugu News