Ambati Rambabu: రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారు: అంబటి రాంబాబు

  • చంద్రబాబు దూరం పెట్టడంతోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్న అంబటి 
  • చంద్రబాబు ముసలి సైకో అంటూ మండిపాటు
  • సత్తెనపల్లి సభలో అన్ని అబద్ధాలే మాట్లాడారని విమర్శ
ap minister ambati rambabu says chandrababus meeting in sattenapalli is a flop show

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. చంద్రబాబు ముసలి సైకో అంటూ నిప్పులు చెరిగారు. కోడెల ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు దూరం పెట్టడంతోనే మానసిక క్షోభకు గురై కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. 

సత్తెనపల్లిలో చంద్రబాబు సభకు దాదాపు 50 వేల నుంచి 60 వేల మంది వచ్చారని టీడీపీ చేస్తున్న ప్రచారం బూటకమని అంబటి రాంబాబు అన్నారు. నిన్నటి సభ అట్టర్ ఫ్లాప్ షో అన్నారు. జనం లేక సభ వెలవెలపోయిందన్నారు. ఐదారుగురు అభ్యర్థులు పోగేస్తే కేవలం నాలుగైదు వేల మంది మాత్రమే వచ్చారని అన్నారు.

లేని జనాన్ని ఉన్నట్లు చెబుతున్నారని, ఇదంతా విఠలాచార్య, రాజమౌళి దర్శకుల నుంచి నేర్చుకున్నట్లుగా ఉందని అంబటి ఎద్దేవా చేశారు. వారు సినిమాల్లో చూపించినట్లు.. టీడీపీ వాళ్లు కూడా లేని జనాన్ని ఉన్నట్లు గ్రాఫిక్స్‌తో చూపుతున్నారని ఎద్దేవా చేశారు.

జగన్ రాజకీయాలకు అనర్హుడంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్‌కు అంబటి కౌంటర్ ఇచ్చారు. జనం రాని చంద్రబాబు, నారా లోకేశ్ లు అర్హులా? అని ప్రశ్నించారు. సత్తెనపల్లి సభలో చంద్రబాబు అన్నీ అబద్ధాలే మాట్లాడారని.. ఒక్క నిజం కూడా చెప్పలేదని ధ్వజమెత్తారు.

రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారంటూ విమర్శించారు. తాను నీతిమంతుడినని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలనని అంబటి అన్నారు. తనకు, తన సోదరుడికి మధ్య గ్యాప్ వచ్చిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. చంద్రబాబుకు, ఆయన తమ్ముడికి మధ్య ఉన్నదే చిదంబర రహస్యమని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేతగాని తనం వల్లనే పోలవరం జాప్యం అయిందని ఆరోపించారు. చంద్రబాబు తప్పిదం వల్ల రూ.2 వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు.

More Telugu News