West Bengal: శ్రీరామనవమి హింసాత్మక ఘటనలపై ఎన్‌ఐఏతో దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు ఆదేశం

  • శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు
  • ఎన్‌ఐఏ దర్యాప్తు కోరుతూ బీజేపీ నేత సువేందు అధికారి ప్రజాప్రయోజన వ్యాజ్యం
  • ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టాలంటూ కలకత్తా హైకోర్టు ఆదేశం
  • కేసు డాక్యుమెంట్లు ఎన్ఐఏకు అప్పగించేందుకు బెంగాల్ పోలీసులకు రెండు వారాల గడువు
Calcutta HC orders NIA probe into Ram Navami violence in West Bengal

పశ్చిమ బెంగాల్‌లో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థతో (ఎన్ఐఏ) దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు తాజాగా ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన పత్రాలు, సీసీటీవీ కెమెరా ఫుటేజీ, ఇతర సాక్ష్యాలను రెండు వారాల్లోపు ఎన్ఐఏకు అప్పగించాలంటూ పశ్చిమ బెంగాల్ పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు కోరుతూ బీజేపీ నేత సువేందు అధికారి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కలకత్తా హైకోర్టు గురువారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 

హౌరా సహా పలు నగరాల్లో శ్రీరామనవమి సందర్భంగా చేపట్టిన ర్యాలీల్లో వేల మంది పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో పలు ప్రాంతాలు మారుమోగిపోయాయి. ఈ క్రమంలోనే హింస ప్రజ్వరిల్లింది. వాహనాలకు నిప్పంటించడం, రాళ్లు విసరడం, షాపులను దోచుకోవడం తదితర ఘటనలు సంభవించాయి. అల్లర్ల కట్టడికి భారీగా పోలీసులను మోహరించాల్సి వచ్చింది. 

ర్యాలీలకు అనుమతులు ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు దాడులకు దిగారంటూ దాఖలైన పిటిషన్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీచేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More Telugu News