Telangana: కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలి సంతకంపై సర్వత్రా ఉత్కంఠ!

Excitement about CM KCRs first signature in the new secretariat
  • ఈ నెల 30న నూతన సచివాలయం ప్రారంభోత్సవం
  • 30న మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 గంటల మధ్య ఒక ఫైలుపై సంతకం చేయాలంటూ అధికారులకు సీఎస్ ఆదేశం 
  •  ఆరేళ్ల తర్వాత సచివాలయంలోకి అడుగు పెట్టనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వ నూతన సచివాలయం ఈ నెల 30న ప్రారంభం కానుంది. బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టిన కొత్త సచివాలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే బీఆర్కే భవన్ నుంచి కొత్త సచివాలయంలో తమకు కేటాయించిన అంతస్తుల్లోని ఛాంబర్లకు ఆయా శాఖలకు చెందిన ఫైళ్లు, రికార్డులను తీసుకెళ్తున్నారు. ఆయా శాఖలకు సంబంధించిన కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ పరికరాలు, జిరాక్స్‌ మెషీన్లు, ప్రింటర్లు, ఇతర సామగ్రిని తరలిస్తున్నారు.  30న మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 గంటల మధ్య అధికారులు ఒక ఫైలుపై సంతకం చేయాలంటూ సీఎస్‌ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.

 ఈ నేపథ్యంలో అధికారులతో పాటు సీఎం కేసీఆర్ కొత్త సచివాలయంలో తొలి సంతకం ఏ ఫైలుపై చేయబోతున్నారనే చర్చ మొదలైంది. దళితబంధు రెండో విడత అమలు మార్గదర్శకాల ఫైలుపై సంతకం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పోడు హక్కు పట్టాల పంపిణీ, సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల సాయం మార్గదర్శకాల ఫైళ్లలో ఏదొకదానిపై సంతకం పెట్టొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. లేదంటే ఏదైనా కొత్త సంక్షేమ పథకం ప్రకటన ఫైలుపై కూడా చేసే అవకాశముందని తెలుస్తోంది. కాగా, 2016 నవంబర్‌ చివరి వారం తర్వాత నుంచి సీఎం కేసీఆర్‌ పాత సచివాలయంలోకి వెళ్లలేదు. ఆ తర్వాత  2019 జూన్‌ 27న కొత్త సెక్రటేరియెట్‌ భవనానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తవడంతో ఏకంగా ఆరేళ్ల తర్వాత ఆయన సచివాలయంలో అడుగు పెట్టనున్నారు.
Telangana
KCR
new secretariat
first signature
April 30

More Telugu News