tcs: ఉద్యోగుల వేతన వ్యత్యాసాన్ని తగ్గించేందుకు టీసీఎస్ యత్నం.. వేతనాల రెట్టింపుకు ప్రోగ్రామ్స్

  • కఠిన పరిస్థితుల్లోను టీసీఎస్ ప్రత్యేక పంథా
  • ఉద్యోగుల్లో నైపుణ్యం పెంచి, వేతనాలు రెట్టింపు చేసేలా ప్రోగ్రామ్స్
  • హైలెవల్ ప్రోగ్రామ్స్ ద్వారా వారికి అదిరిపోయే ఆఫర్లు!
TCS is planning to reduce pay gap among employees

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో చాలా కంపెనీలు తమ మనుగడ కోసం వేతనాల్లో కోత, ఉద్యోగాల కోతను ప్రకటిస్తుండటం మనం చూస్తున్నదే. ప్రస్తుతం టెక్ పరిశ్రమ కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయితే ఇందుకు దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ - TCS మినహాయింపు అని చెప్పవచ్చు. ప్రస్తుత ఛాలెంజింగ్ సమయంలోను టీసీఎస్ తన ఉద్యోగులను కొనసాగించడంతో పాటు, వారి వేతన వ్యత్యాసాలను కూడా తగ్గించేందుకు కృషి చేస్తోంది.

ఏ కంపెనీలలో అయినా సీనియర్, జూనియర్ ఉద్యోగుల వేతనాలలో వ్యత్యాసం సాధారణమే. అయితే, టీసీఎస్ దీనిని సాధ్యమైనంత మేర తగ్గించాలని భావిస్తూ, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగులలో నైపుణ్యం పెంచడానికి, వారి వేతనాలను రెట్టింపు చేసేందుకు అవకాశం కల్పించాలని కంపెనీ చూస్తోందని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ఇటీవల 'మనీ కంట్రోల్' ఇంటర్వ్యూలో చెప్పారు.

టీసీఎస్ లో ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఫ్రెషర్లకు భారీ ఇంక్రిమెంట్ ను అందించడం కంటే వారి అంతర్గత ప్రతిభపై పెట్టుబడి పెట్టడం, వారిని మరింత నిష్ణాతులుగా తీర్చిదిద్దడమే కంపెనీ వ్యూహం. వీటితో పాటు వేతన వ్యత్యాసాన్ని తగ్గించే ప్రణాళికతో సాగుతున్నట్లు మిలింద్ చెప్పారు. గత రెండేళ్లలో తమ కంపెనీ నుండి మరింత అదనపు వేతనానికి ఇతర కంపెనీలలోకి వెళ్లిన వారు ఉన్నారని, ఆ తర్వాత తాము మరికొంతమందిని జాయిన్ చేసుకున్నామని చెప్పారు.

వివిధ ఎక్స్‌పీరియన్స్ కలిగిన మరికొంతమంది ఉద్యోగులను చేర్చుకోవాలని యోచిస్తున్నామని నివేదిక పేర్కొంది. తమ ప్రోగ్రామ్స్ ద్వారా వారు ప్రస్తుతం పొందుతున్న వేతనానికి రెట్టింపు అందిపుచ్చుకునే అవకాశం కల్పించడమే వారి ఉద్దేశ్యం. అయితే ఈ హైలెవల్ ప్రోగ్రామ్స్ ను తమ ఫస్ట్ అటెంప్ట్ లో పది శాతం మంది మాత్రమే క్లియర్ చేస్తున్నారు. టాలెంట్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్, ఎలివేషన్ ద్వారా టీసీఎస్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఈ ప్రోగ్రామ్ కోసం 0 నుండి 12 ఏళ్ల అనుభవం కలిగిన వారు నాలుగు లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరు హైలెవల్ ప్రోగ్రామ్ ను క్లియర్ చేయడం ద్వారా వేతనాలను రెట్టింపు చేసుకునే అవకాశం ఉంటుంది.

నాలుగు నుండి పన్నెండు సంవత్సరాల అనుభవం కలిగిన ఉద్యోగులు ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ, అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో నిపుణులు కావొచ్చునని లక్కడ్ తెలిపారు. ఆ తర్వాత వారు దృష్టి పెట్టాలనుకునే పరిశ్రమను ఎంచుకోవచ్చునని చెప్పారు.

tcs

More Telugu News