Noor Ahmed: అటు రషీద్ ఖాన్... ఇటు నూర్ అహ్మద్... ముంబయిని ముంచేశారు!

  • అహ్మదాబాద్ లో ముంబయి వర్సెస్ గుజరాత్ టైటాన్స్
  • 55 పరుగుల తేడాతో నెగ్గిన గుజరాత్
  • 208 పరుగుల లక్ష్యఛేదనలో 152 పరుగులు చేసిన ముంబయి
  • సత్తా చాటిన ఆఫ్ఘన్ స్పిన్ ద్వయం నూర్ అహ్మద్, రషీద్ ఖాన్
  • ఈ ఇద్దరు స్పిన్నర్ల ధాటికి ముంబయి టాపార్డర్ విలవిల
Gujarat Titans beat Mumbai Indians by 55 runs

ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ ట్విన్స్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ముంబయి ఇండియన్స్ ను హడలెత్తించారు. 208 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన ముంబయి ఇండియన్స్ పాలిట వీళ్లిద్దరూ విలన్లుగా మారారు. 

ఏ దశలోనూ గెలిచేలా కనిపించని ముంబయి ఇండియన్స్ చివరికి 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులు చేసి ఓటమిపాలైంది. నూర్ లెఫ్టార్మ్ గూగ్లీ బౌలింగ్ తో మ్యాజిక్ చేయగా, రషీద్ ఖాన్ రైట్ ఆర్మ్ గూగ్లీ బౌలింగ్ తో వికెట్ల వేట సాగించాడు. వీళ్లిద్దరి ధాటికి ముంబయి ఇండియన్స్ టాపార్డర్ విలవిల్లాడింది. 

తొలుత, ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ (2)ను గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓ చక్కని కాట్ అండ్ బౌల్డ్ ఫీట్ తో పెవిలియన్ చేర్చాడు. అక్కడ్నించి నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ హవా మొదలైంది. 

ఇషాన్ కిషన్ (13), ప్రమాదకర తిలక్ వర్మ (2)లను రషీద్ ఖాన్ అవుట్ చేయగా... క్రీజులో నిలదొక్కుకుంటున్న కామెరాన్ గ్రీన్ (33), సూర్యకుమార్ యాదవ్ (23), టిమ్ డేవిడ్ (0)లను పెవిలియన్ చేర్చడం ద్వారా నూర్ అహ్మద్ ముంబయి ఇండియన్స్ ను దెబ్బకొట్టాడు. 

అయితే, నేహాల్ వధేరా (40), పియూష్ చావ్లా (18) పోరాడడంతో ముంబయి స్కోరు 100 దాటింది. లేని పరుగు కోసం వెళ్లి చావ్లా రనౌట్ కాగా, ఓ స్కూప్ షాట్ కొట్టే యత్నంలో వధేరా వికెట్ సమర్పించుకున్నాడు. 

ఇక, సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్ కు దిగడంతో మైదానంలో కాస్త సందడి నెలకొంది. చివరి ఓవర్లో ఓ సిక్స్ కొట్టిన అర్జున్ టెండూల్కర్ అభిమానులను అలరించాడు. అదే ఊపులో మరో భారీ షాట్ కొట్టబోయి లాంగాన్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3, రషీద్ ఖాన్ 2, మోహిత్ శర్మ 2 హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది.

More Telugu News