Telangana: తెలంగాణలో వడగళ్లతో కూడిన భారీ వర్షం... ఉక్కపోత నుండి హైదరాబాద్ వాసులకు కాస్త ఊరట

  • అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు
  • కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం
  • పిడుగుపాటుకు పదుల సంఖ్యలో మేకలు మృతి
Heavy hailstone rain in Telangana

తెలంగాణలో మంగళవారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. వికారాబాద్, జనగామ సహా చాలా చోట్ల వడగళ్ల వాన కురిసింది. అకాల వర్షాలు కురవడంతో చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యపు రాశులు తడిసి పోయాయి. చాలా చోట్ల వాననీటికి ధాన్యం కొట్టుకుపోయింది. జనగామ జిల్లా, నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, హైదరాబాద్ తదితర చోట్ల భారీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి బీమారం మండలం గోవిందారంలో పిడుగుపాటుకు పదుల సంఖ్యలో మేకలు మృతి చెందాయి.

హైదరాబాద్ లో ఈదురు గాలులతో వర్షం

భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షం కురిసింది. గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. మియాపూర్, బాలానగర్, పటాన్ చెరు, అల్వాల్, మల్కాజిగిరి, పంజాగుట్ట, కాప్రా తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. ఉక్కపోతకు ఇబ్బంది పడుతున్న వారికి భారీ వర్షంతో కాస్త ఊరట లభించింది.

More Telugu News