Ajinkya Rahane: నేను ఇంతకంటే బాగా ఆడతాను: రహానే

  • తాజా ఐపీఎల్ సీజన్ లో రహానే మెరుపులు
  • 5 ఇన్నింగ్స్ లలో 209 పరుగులు
  • రహానే స్ట్రయిక్ రేటు 199.04
  • తనలోని అత్యుత్తమ ఆట ఇంకా బయటికి రాలేదన్న రహానే
  • గత సీజన్ తో రహానే కెరీర్ ముగిసిందని అందరూ భావించిన వైనం
  • అనూహ్యరీతిలో విజృంభిస్తున్న ముంబయి వాలా
Rahane says his best yet to come

ఐపీఎల్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు... అజింక్యా రహానే. తాజా సీజన్ లో కుర్రాళ్లకు దీటుగా బంతిని చితక్కొడుతూ రహానే కొన్ని సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటిదాకా 5 ఇన్నింగ్స్ లలో 209 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. రహానే యావరేజి 52.25 కాగా... స్ట్రయిక్ రేట్ 199.04 కావడం విశేషం. 

ఈ టోర్నీలో ఇప్పటివరకు 11 సిక్సులు, 18 ఫోర్లు బాదిన రహానే... టోర్నీలో సెకండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇంత విధ్వంసకరంగా ఆడుతున్న రహానే వయసు 34 సంవత్సరాలు. ఐపీఎల్ ఫామ్ దెబ్బతో రహానేకు వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఆడే టీమిండియాలో చోటు దక్కింది. 

కాగా, తన తాజా ప్రదర్శనపై రహానే స్పందించాడు. ఓ ఆటగాడిలో ఉన్న ప్రతిభ బయటికి రావాలంటే అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. చాన్సులు రాకపోతే అతడిలో టాలెంట్ ఉన్న విషయం ఎలా తెలుస్తుందని ప్రశ్నించాడు. గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో తనకు పెద్దగా ఆడే అవకాశం రాలేదని రహానే తెలిపాడు. 

తాజా సీజన్ లో తన ఆటతీరును ఎంజాయ్ చేస్తున్నానని, అయితే ఇదే తన అత్యుత్తమ ప్రదర్శన కాదని, తనలోని అసలైన ఆట ఇంకా బయటికి రాలేదని పేర్కొన్నాడు. బ్యాటింగ్ కు దిగిన సమయంలో జట్టు కోసం ఏంచేయాలన్నదే ఆలోచిస్తానని, ఫలితం గురించి పట్టించుకోనని రహానే స్పష్టం చేశాడు. 

రహానే గత సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించగా, అసలు జట్టులో ఉన్నాడో లేడో కూడా తెలియనంతగా అతడిని మర్చిపోయారు. ఆ సీజన్ అనంతరం కోల్ కతా అతడిని విడుదల చేయడంతో, రహానే ఐపీఎల్ కెరీర్ ఇక ముగిసినట్టేనని భావించారు. 

ఫామ్ కోల్పోయిన స్థితిలో, మినీ వేలంలో అతడిని ఎవరూ కొనుగోలు చేయరని అందరూ భావించారు. కానీ అనూహ్య రీతిలో, ధోనీ సూచనతో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం వేలంలో రహానేను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు అదే రహానే తన సంచలన బ్యాటింగ్ తో మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. కనీస ధర రూ.50 లక్షలతో కొనుగోలు చేసినప్పటికీ, అంతకు ఎన్నో రెట్లు విలువైన ఆటతీరుతో రహానే చెన్నై సూపర్ కింగ్స్ కు బ్యాటింగ్ ఆస్తిలా మారాడు.

More Telugu News