Andre Russell: కోల్ కతాకు తలనొప్పిగా మారిన ఆండ్రూ రస్సెల్!

  • ఈ సీజన్ లో బ్యాటింగ్, బౌలింగ్ తో ఒక్క మ్యాచ్ లోనే మెరిసిన రస్సెల్
  • మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ విఫలం
  • రూ.16 కోట్లు తీసుకుంటూ కోల్ కతా పర్సుకు భారం
Why Andre Russell has become a big worry for KKR in IPL 2023

కోల్ కతా నైట్ రైడర్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో పేలవ పనితీరు చూపిస్తోంది. మొదటి రెండు మ్యాచుల్లో సత్తా చాటిన ఈ జట్టు తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమి పాలైంది. ముఖ్యంగా కోల్ కతా జట్టులోని కీలక ఆటగాళ్లలో ఒకడైన ఆండ్రూ రస్సెల్ పనితీరు ఆశించిన విధంగా లేదు. మంచి ఆల్ రౌండర్ గా, విధ్వంసకర బ్యాటర్ గా పేరున్న రస్సెల్ రెండు విభాగాల్లో తేలిపోతున్నాడు. 

చివరిగా ఈ నెల 23న చెన్నై తో జరిగిన మ్యాచ్ లో 6 బంతులు ఎదుర్కొని 9 పరుగులు చేసి, అవుటై వెనుదిరిగాడు. 7 మ్యాచుల్లో రస్సెల్ ఇంత వరకు చేసిన పరుగులు 107. స్ట్రయిక్ రేటు 140.79. మొదటి మ్యాచ్ పంజాబ్ పై 19 బంతుల్లో చేసిన 35 పరుగులే ఈ సీజన్ లో అతడి బెస్ట్ బ్యాటింగ్. బ్యాటుతో గత సీజన్లలో రస్సెల్ విధ్వంసం సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ, ఆ ఛాయలు ఈ సీజన్ లో మచ్చుకైనా కనిపించడం లేదు. 

రస్సెల్ పెద్దగా బౌలింగ్ కూడా చేయడం లేదు. దీనికి కారణం ఫిట్ నెస్ సమస్యలే. ఈ నెల 14న హైదరాబాద్ తో మ్యాచులో 2.1 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి మెరిశాడు. గాయపడడంతో అక్కడి నుంచి పెద్దగా బౌలింగ్ చేయడం లేదు. కోల్ కతా పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. దీనికి ఒక్క రస్సెల్ నే నిందించడం కూడా సరికాదు. అసలు జట్టు కూర్పు కూడా కుదురుకోలేదు. ఓపెనర్లు, టాపార్డర్ లో తరచూ మార్పులు చేస్తూ కోల్ కతా యాజమాన్యం ప్రయోగాలు చేస్తోంది. దీంతో ఇంత వరకు ఒక్కటీ సత్ఫలితాలను ఇవ్వడం లేదు. జేసన్ రాయ్ ఒక్కడే బ్యాటుతో ఫర్వాలేదనిపిస్తున్నాడు. 

అయితే రూ.16 కోట్ల పారితోషికం తీసుకుంటున్న రస్సెల్ ఇలాంటి ఫలితాలు చూపిస్తుండడమే ఆ జట్టుకు తలనొప్పిగా మారింది. రస్సెల్ అనే కాదు.. పంజాబ్ కింగ్స్ శామ్ కరన్ 18 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ బెన్ స్టోక్స్ రూ.16.25 కోట్లు, ముంబై ఇండియన్స్ కామెరాన్ గ్రీన్ 17.50 కోట్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ హారీబ్రూక్ రూ.13.25 కోట్లు.. వీరంతా కూడా తాము తీసుకుంటున్న పారితోషికానికి న్యాయం చేయలేకపోతున్నారు. రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల మధ్య తీసుకుంటున్న ఆటగాళ్లు చాలా మంది మంచి ఫలితాలతో ఆయా జట్లకు కీలకంగా మారుతున్నారు.

More Telugu News