Chhattisgarh: మరో యువతిని పెళ్లాడుతున్న ప్రియుడు.. అబ్బాయిలా వచ్చి యాసిడ్ పోసిన ప్రియురాలు.. ఆగిన పెళ్లి!

Girl Friend throws acid on boy friend who marries another girl in Chhattisgarh
  • చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఘటన
  • గొడవ కారణంగా ప్రియురాలిని దూరం పెట్టిన ప్రియుడు
  • మరో అమ్మాయితో కుదిరిన పెళ్లి
  • చంపి పగ తీర్చుకునేందుకు యాసిడ్ దాడి చేసిన ప్రియురాలు
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే, ప్రియురాలితో జరిగిన గొడవ కారణంగా ప్రియుడు ఆమెను దూరం పెట్టాడు. ఆ తర్వాత మరో యువతిని చూసి పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన యువతి నేరుగా పెళ్లి మండపానికి చేరుకుని యాసిడ్ దాడికి పాల్పడింది. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. 

పోలీసుల కథనం ప్రకారం.. బానుపురికి చెందిన దమ్రుధర్ బాఘేల్ (25) ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కలిసి ఎన్నో బాసలు చెప్పుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక్కటి కావాలని భావించారు. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో బాఘేల్ ప్రియురాలిని దూరం పెట్టాడు. ఈ క్రమంలో మరో యువతితో అతడికి పెళ్లి నిశ్చయమైంది. 

విషయం తెలిసిన ప్రియురాలు కోపంతో రగిలిపోయింది. తనను దూరం పెట్టి మరో యువతికి దగ్గరవుతుండడాన్ని జీర్ణించుకోలేకపోయింది. అతడిని చంపి పగ తీర్చుకోవాలని భావించింది. అనుకున్నదే ఆలస్యం.. అబ్బాయిలా వేషం మార్చుకుని యాసిడ్ సీసాతో ప్రియుడి పెళ్లి జరుగుతున్న మండపానికి చేరుకుంది. సమయం చూసి పీటలపై కూర్చున్న వధూవరులపై యాసిడ్ సీసా విసిరింది. అంతే.. మండపంలో ఒక్కసారిగా హాహాకారాలు చెలరేగాయి. బాధతో వధూవరులిద్దూ కేకలు పెట్టారు. 

యాసిడ్ పడడంతో మరో పదిమంది కూడా గాయపడ్డారు. అదే సమయంలో కరెంటు పోవడంతో ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇదే అదునుగా నిందితురాలు అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మండపానికి చేరుకుని సీసీటీవీలు పరిశీలించారు. వధూవరులపై యాసిడ్ దాడికి పాల్పడింది అబ్బాయి వేషంలో ఉన్న అమ్మాయని, ఆమె వరుడి మాజీ ప్రియురాలు అని గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, గాయాలతో వధూవరులిద్దరూ ఆసుపత్రిలో చేరడంతో పెళ్లి ఆగిపోయింది.
Chhattisgarh
Bastar District
Love Affair
Crime News

More Telugu News