Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక!

  • 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం
  • ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం
  • ఆ తర్వాత సునామీ హెచ్చరికల ఎత్తివేత
Huge Earthquake Jolts Indonesia Tsunami Warning Issued

ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. ఈ తెల్లవారుజామున సుమత్రా దీవుల్లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం ఉందని తొలుత హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆ తర్వాత సునామీ హెచ్చరికలను అధికారులు ఉపసంహరించుకున్నారు. 

తాజా భూకంపం భూమికి 84 కిలోమీటర్ల లోతున స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు సంభవించినట్టు ఇండోనేషియా జియో ఫిజిక్స్ ఏజెన్సీ (బీఎంకేజీ) పేర్కొంది. ఆ తర్వాత కూడా పలు ప్రకంపనలు నమోదయ్యాయి. ఇందులో ఒకదాని తీవ్రత 5గా రికార్డయింది. 

పశ్చిమ సుమత్రా రాజధాని పెడాంగ్‌ను భూకంపం కుదిపేసిందని, భయంతో చాలామంది తీరం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్టు అధికార ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు. అయితే, భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి నష్టం సంభవించలేదన్నారు. 

కాగా, భూకంపంతో భయపడిన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొందరు మోటార్ సైకిళ్లు, ఇతర వాహనాలపై వెళ్తుండగా, మరికొందరు నడిచే వెళ్తున్నట్టు వీడియోల్లో కనిపిస్తోంది. సిబెరుట్ దీవిని ప్రజలు ఇప్పటికే ఖాళీ చేశారు. సునామీ హెచ్చకలు ఎత్తివేసిన తర్వాతే వస్తామని చెప్పారు.

More Telugu News