YS Sharmila: వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్... చంచల్ గూడ జైలుకు తరలింపు

  • మే 8వ తేదీ వరకు రిమాండ్ లో షర్మిల
  • ఉదయం ఇంటి నుండి బయలుదేరిన సమయంలో పోలీసులతో వాగ్వాదం
  • చేయి చేసుకున్న షర్మిల... కేసు నమోదు
YS Sharmila remand for 14 days

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. మే 8వ తేదీ వరకు ఆమె రిమాండులో ఉండనున్నారు. 

సిట్ కార్యాలయాన్ని ముట్టడించిన అనంతరం టీ సేవ్ నిరాహార దీక్షలో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కోరాలని షర్మిల నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇంటి నుండి షర్మిల బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేయగా వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్నందుకు గాను ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

షర్మిల సహా ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా షర్మిల, ఏ2గా కారు డ్రైవర్ బాలు, ఏ3గా మరో డ్రైవర్ జాకబ్ పేర్లను చేర్చారు. షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. 

కాగా, షర్మిల బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. షర్మిల బెయిల్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది.

More Telugu News