Mani Ratnam: అదే జరగకుంటే.. పొన్నియన్ సెల్వన్ తీసేవాడిని కాదు: మణిరత్నం

mani ratnam speech at ponniyin selvan 2 pre release event he speaks about rajamouli
  • ‘బాహుబలి’ లేకపోతే ‘పొన్నియన్ సెల్వన్’ లేదన్న మణిరత్నం
  • రాజమౌళి వేసిన బాటలోనే తామంతా వెళ్తున్నామని వ్యాఖ్య
  • మన సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కేలా చేశారని ప్రశంసలు
దిగ్గజ దర్శకుడు మణిరత్నం రూపొందించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 2’. మరో నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తి, త్రిష తదితర తారలు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మణిరత్నం మాట్లాడుతూ.. దర్శక ధీరుడు రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు. బాహుబలి స్ఫూర్తితోనే ‘పొన్నియన్ సెల్వన్’ను తెరకెక్కించినట్లు తెలిపారు. బాహుబలిని రెండు భాగాలుగా తీయకపోయుంటే.. పొన్నియన్ సెల్వన్ తీసేవాడిని కాదని అన్నారు. తన టీమ్ రాజమౌళికి కృతజ్ఞతలు తెలుపుతోందని అన్నారు.

‘‘నేను గతంలోనే ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. రాజమౌళికి కూడా చెప్పాను. మరోసారి చెబుతున్నా. బాహుబలి లేకపోతే పొన్నియన్ సెల్వన్ లేదు. రాజమౌళి తన సినిమాను రెండు భాగాలుగా తీయకపోతే.. నేను ఈ సినిమాను తీసేవాడిని కాదు. ఆయన వేసిన బాటలోనే మేమంతా వెళ్తున్నాం’’ అని మణిరత్నం ప్రశంసలు కురిపించారు.  

మన సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా రాజమౌళి చేశారని కొనియాడారు. పొన్నియన్ సెల్వన్‌ని రెండు భాగాలుగా మలిచేందుకు బాహుబలి మార్గాన్ని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. బాహుబలి.. చారిత్రాత్మక సినిమాలు చేసేందుకు కావాల్సిన నమ్మకాన్ని సినీ ఇండస్ట్రీకి ఇచ్చిందని అన్నారు. భారతీయ చరిత్రను సినిమాలుగా మార్చేందుకు రాజమౌళి చాలా మంది దర్శక నిర్మాతలకు పెద్ద మార్గాన్ని తెరిచారని కొనియాడారు.
Mani Ratnam
ponniyin selvan
Rajamouli
bahubali

More Telugu News