Cheetah: దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చీతా మృతి .. నెల రోజుల్లో రెండో ఘటన

  • దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన 12 చీతాల్లో ‘ఉదయ్’ ఒకటి
  • నిన్న ఉదయం అనారోగ్యంతో కనిపించిన చీతా
  • చికిత్స అందిస్తుండగా సాయంత్రం 4 గంటలకు మృతి
  • మార్చిలో నమీబియా చీతా ‘సాషా’ కన్నుమూత
Another Cheetah Uday died in Kuno National Park second death in a month

దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తీసుకొచ్చిన మరో చీతా ప్రాణాలు కోల్పోయింది. చీతాలు చనిపోవడం నెల రోజుల్లో ఇది రెండోసారి. చికిత్స పొందుతూ మగ చీతా ఉదయ్ నిన్న మరణించినట్టు ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ తెలిపారు. అనారోగ్యం పాలవడంతో చికిత్స అందిస్తుండగా చనిపోయినట్టు చెప్పారు. మరణానికి గల కారణం తెలియాల్సి ఉందన్నారు. 

‘ఉదయ్’ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆదివారం ఉదయం అటవీ బృందం గుర్తించింది. ఆ తర్వాత దానిని చికిత్స కోసం మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో మృతి చెందింది. పశువైద్య బృందం దానికి పోస్టుమార్టం నిర్వహించనుంది. ఈ సందర్భంగా మొత్తం ప్రక్రియను వీడియో తీయనున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 12 చీతాలను కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చారు. అందులో ఉదయ్ ఒకటి. గతేడాది నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒకటైన సాషా ఈ ఏడాది మార్చిలో కన్నుమూసింది. నెల రోజుల వ్యవధిలో ఇప్పుడు మరో చీతా మరణించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు చీతాలు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడున్న చీతాల సంఖ్య 18కి పడిపోయింది.

More Telugu News