IMD: ఏపీలోని ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం.. విపత్తుల శాఖ వార్నింగ్

  • ఉభయ గోదావరి జిల్లాలవాసులకు హెచ్చరిక
  • పంట పొలాల్లో, ఆరుబయట చెట్ల కింద ఉండొద్దంటూ సూచన
  • మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడి
IMD Issues Thunderstorm Warning In Andhra Pradesh

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అన్నదాతలను ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆదివారం మరోమారు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ హెచ్చరించింది. పంట పొలాల్లో, ఆరు బయట చెట్ల కింద ఉండొద్దని సూచించింది. పొలంలో పని చేసే రైతులు, కూలీలు, పశు-గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది.

వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా ఆది, సోమ వారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు వర్షాలు కురుస్తాయని, పిడుగుపాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.

More Telugu News