Gujarat Titans: ఆఖర్లో అద్భుతం... నమ్మశక్యం కాని రీతిలో గెలిచిన గుజరాత్ టైటాన్స్

  • ఐపీఎల్ లో మరో సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్
  • మొదట 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 రన్స్ చేసిన టైటాన్స్
  • లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 7 వికెట్లకు 128 పరుగులే చేసిన లక్నో
  • చివరి ఓవర్లో వరుసగా 4 వికెట్లు కోల్పోయిన లక్నో జట్టు
  • అద్భుతంగా బౌలింగ్ చేసిన మోహిత్ శర్మ
Gujarat Titans unbelievable win over LSG

ఓడిపోతారనుకున్న మ్యాచ్ లో గెలిస్తే ఆ మజాయే వేరు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ పరిస్థితి అలాగే ఉంది. మొదట బ్యాటింగ్ చేసి సాధించింది 135 పరుగులే అయినా, ఆ స్వల్ప స్కోరును చివరి ఓవర్ వరకు తీసుకువచ్చి అద్భుతంగా గెలవడం గుజరాత్ టైటాన్స్ కే సాధ్యమైంది. 

గుజరాత్ టైటాన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ లో ఈ నమ్మశక్యం కాని ఫలితం ఆవిష్కృతమైంది. 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 128 పరుగులే చేసి ఓటమిపాలైంది. 

మోహిత్ శర్మ విసిరిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో లక్నో సూపర్ జెయింట్స్ విజయానికి 12 పరుగులు అవసరం కాగా.... లక్నో ఏకంగా 4 వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. ఆ ఓవర్ లో మోహిత్ శర్మ వరుసగా రెండు వికెట్లు తీయగా, ఆ తర్వాత రెండు బంతుల్లో మరో ఇద్దరు బ్యాటర్లు రనౌట్ అయ్యారు. 

లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆఖరి ఓవర్ లో బాదేస్తాడని అందరూ భావించారు. కానీ, ఆ ఓవర్లో అతడే ముందు అవుటయ్యాడు. కేఎల్ రాహుల్ 68 పరుగులు చేసి భారీ షాట్ కొట్టే యత్నంలో జయంత్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టొయినిస్ కూడా మోహిత్ శర్మ విసిరిన బంతికి లాంగాన్ లో దొరికిపోయాడు.

అనంతరం ఆయుష్ బదోనీ, దీపక్ హుడా వరుస బంతుల్లో రనౌట్ కావడంతో లక్నో ఆశలు అడుగంటాయి. చివరి బంతికి రవి బిష్ణోయ్ పరుగులేమీ చేయలేక నిస్సహాయంగా మిగిలిపోయాడు. మొత్తమ్మీద అనూహ్య రీతిలో గుజరాత్ టైటాన్స్ 7 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. 

గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 2, నూర్ అహ్మద్ 2, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్ మన్లలో రాహుల్ 68, కైల్ మేయర్స్ 24, కృనాల్ పాండ్యా 23 పరుగులు చేశారు. నికోలాస్ పూరన్ (1), ఆయుష్ బదోని (8), మార్కస్ స్టొయినిస్ (0), దీపక్ హుడా (2) విఫలమయ్యారు.

టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ 


నేడు డబుల్ హెడర్ లో భాగంగా రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది.

More Telugu News