బ్లూటిక్ లేకపోతే నీవు నిజమైన సచిన్ అని ఎలా గుర్తించాలి?: ఓ అభిమాని ప్రశ్న
- ట్విట్టర్ లో సచిన్ టెండుల్కర్ కు ఎదురైన ప్రశ్న
- ఇప్పటికి ఇదే నా బ్లూటిక్ అంటూ నవ్వు సింబల్ చూపించిన టెండుల్కర్
- ఇది మరీ కచ్చితత్వంగా ఉందన్న ఓ యూజర్
ఈ నెల 20 నుంచి చందా కట్టని వారి ట్విట్టర్ ఖాతాల నుంచి బ్లూ టిక్ కనిపించకుండా పోయింది. అందులో సచిన్ టెండుల్కర్ ఖాతా కూడా ఉంది. బ్లూ టిక్ ఉంటే అది సచిన్ ఖాతానే అని తెలుసుకోవడం సులభం. మరి బ్లూ టిక్ లేకపోతే అది సచిన్ ఖాతానా? లేక మరొకరు క్రియేట్ చేసిన నకిలీదా? ఎలా తెలుసుకోవాలి? ఇదే సందేహం ఓ అభిమానికి ఎదురైంది. సచిన్ టెండుల్కర్ ట్విట్టర్ లో ‘నన్ను ఏదైనా అడగొచ్చు’ అనే సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని సచిన్ ను బ్లూ టిక్ పై ప్రశ్నించాడు.
‘‘ఇప్పుడు నీకు బ్లూ టిక్ లేదు. అలాంటప్పుడు నీవు అసలైన సచిన్ అని మేము ఎలా నమ్మాలి? అని అభిషేక్ అనే యూజర్ ప్రశ్నించాడు. దీనికి సచిన్ ఊహించని విధంగా బదులిచ్చారు. ఇప్పటికి అయితే ఇదే నా బ్లూటిక్ వెరిఫికేషన్ అంటూ నవ్వు సింబల్ మాదిరిగా చేయిని చూపించాడు. నిజమే ఇది మరీ ఆథెంటిక్ గా ఉందని ఓ యూజర్ కామెంట్ చేశాడు.