MS Dhoni: మ్యాచ్ ముగియగానే ధోనీని చుట్టుముట్టిన సన్ రైజర్స్ ఆటగాళ్లు

 MS Dhoni surrounded by bunch of SRH youngsters in Chepauk
  • నిన్న రాత్రి చెపాక్ స్టేడియంలో చెన్నై, హైదరాబాద్ మధ్య మ్యాచ్
  • 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయిన సన్ రైజర్స్
  • రైజర్స్ యువ ఆటగాళ్లకు విలువైన సూచనలు ఇచ్చిన ధోనీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. ఆడిన ఆరు మ్యాచ్ లలో నాలుగింటిలో ఓడిపోయింది. శుక్రవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లోనూ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మరోసారి బ్యాటర్లు విఫలమై స్వల్ప స్కోరుకే పరిమితం కావడంతో హైదరాబాద్ ను దెబ్బతీసింది. తొలుత హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అనంతరం డెవాన్ కాన్వే చెలరేగి ఆడటంతో చెన్నై సునాయాసంగా గెలిచింది. దాంతో, ఆ జట్టు నాలుగో విజయం సొంతం చేసుకుంది. 

ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దిగ్గజ ఆటగాడు చెన్నై జట్టు కెప్టెన్ ధోనీని సన్ రైజర్స్ ఆటగాళ్లు చుట్టుముట్టారు. యువ క్రికెటర్లు ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ దాగర్ తదితరులకు మహీ ‘క్లాస్’ తీసుకున్నాడు. ఆట విషయంలో ధోనీ చెప్పిన సలహాలు, సూచనలను సన్ రైజర్స్ శ్రద్ధగా వింటూ కనిపించారు. ఈ ఫొటో, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోనీ ఇచ్చిన విలువైన సూచనలు, సలహాలతో అయినా సన్ రైజర్స్ ఈ సీజన్ లో పుంజుకుంటుందేమో చూడాలి.
MS Dhoni
CSK
SRH
IPL 2023

More Telugu News