Narendra Modi: సూడాన్‌లోని భారతీయుల భద్రతపై ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమీక్ష

  • సూడాన్ లో సైన్యం, పారా మిలిటరీ దళాలకు మధ్య పోరు 
  • సూడాన్ లో దాదాపు 4000 మంది భారతీయులు  
  • యుద్ధ క్షేత్రాలుగా విమానాశ్రయాలు
  • కష్టతరంగా మారిన తరలింపు
PM Modi to chair meeting to review situation of Indians stuck in Sudan

సూడాన్ లో అంతర్యుద్ధం నేపథ్యంలో ఆ దేశంలోని భారతీయుల రక్షణపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. వర్చువల్ గా జరగనున్న ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ఎయిర్ ఫోర్స్ నేవీ అధికారులతో పాటు పలువురు అధికారులు, దౌత్యవేత్తలు పాల్గొంటున్నారు. ఈ మేరకు కీలక సమీక్ష ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

సూడాన్ లో సైన్యం, పారా మిలిటరీ దళాలకు మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం సాగుతోంది. ఈ పోరు గత శనివారం నుండి హింసాత్మకంగా మారింది. ఇప్పటి వరకు వందలాది మంది సూడానీయులు మృతి చెందారు. ఇరువర్గాల మధ్య చర్చలు సాగుతున్నప్పటికీ కొలిక్కి రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హింసాత్మక సూడాన్ లో చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.

 సూడాన్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, అక్కడ చిక్కుకున్న భారతీయుల భద్రతను నిర్ధారించడానికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వివిధ స్థాయులలో నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో సూడాన్‌లోని పరిస్థితిని, భారతీయుల భద్రతకు తీసుకుంటున్న చర్యలన్నింటినీ ప్రధాని సమీక్షిస్తారని సమాచారం. వాస్తవానికి, భారత్ తన పౌరులను సూడాన్ నుండి సురక్షితంగా తరలించడానికి సిద్ధంగా ఉంది. అయితే స్థానిక పరిస్థితులను చూసి, అక్కడ చిక్కుకుపోయిన భారతీయులతో మాట్లాడిన తర్వాత మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. సూడాన్ లో దాదాపు 4000 మంది భారతీయులు ఉండొచ్చని సమాచారం. ఇందులో 1500 మంది వరకు అక్కడే స్థిరపడ్డారు.

ఇదిలా ఉండగా సూడాన్ లో కొనసాగుతున్న ఘర్షణల్లో దాదాపు 300 మంది మృతి చెందారు. మరణించిన వారిలో ఓ భారతీయుడు కూడా ఉన్నారు. తమ పౌరులను తీసుకువెళ్లడానికి భారత్ సహా వివిధ దేశాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ విమానాశ్రయాలే యుద్ధ భూములుగా మారాయి. దీంతో విదేశీయుల తరలింపు సాధ్యం కావడం లేదు. మరోవైపు, సూడాన్ లోని భారతీయులను క్షేమంగా తీసుకు రావడానికి మోదీ ప్రభుత్వం కృషి చేయాలని కేరళ సీఎం విజయన్ లేఖ రాశారు.

More Telugu News