Ganta Srinivasa Rao: జగన్ ప్రభుత్వం ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే: గంటా శ్రీనివాసరావు

  • జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్న గంటా శ్రీనివాసరావు
  • రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ధీమా
  • మండుటెండలోనూ లోకేశ్ విజయవంతంగా పాదయాత్ర చేస్తున్నారని వ్యాఖ్య
jagan government has only 356 days says ganta srinivasa rao

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండుటెండలో కూడా పాదయాత్ర విజయవంతంగా నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పాదయాత్రలో లోకేశ్ పరిపూర్ణమైన నాయకుడిగా రూపుదిద్దుకుంటున్నారని కొనియాడారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, 356 రోజులు మాత్రమే ఈ ప్రభుత్వానికి సమయం ఉందని అన్నారు. ఇక రోజులు లెక్క పెట్టుకోవడమే తరువాయి అని అన్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లి.. లోపాయికారిగా స్వప్రయోజనాల కోసం మాట్లాడుకుంటున్నారని విమర్శించారు. ‘‘విశాఖలో పేర్ల మార్పిడి పరంపర కొనసాగుతోంది. సీత కొండ వ్యూ పాయింట్‌ పేరును వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా మార్చడం సరికాదు. ఆ ప్రాంత మనోభావాలు దెబ్బ తీసేలా ఉంది. అవసరమైతే జాతీయ నాయకుల పేర్లు పెట్టాలని కోరుతున్నాం’’ అని గంటా శ్రీనివాసరావు అన్నారు.

బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. అందరి ఆశీస్సులు లోకేశ్ కు ఉండాలని కోరుతున్నామన్నారు. బాబాయి వివేకా హత్య ఉదంతం బయటపడుతుందని సీఎం జగన్ లండన్ టూర్ రద్దు చేసుకున్నారని అన్నారు. విశాఖపట్నం, రాజమండ్రి జైళ్లలో ఏం అవసరమైతే అవి ఇప్పుడే మరమ్మతులు చేయించుకుంటే మంచిదని బండారు సత్యనారాయణ మూర్తి సూచించారు.

More Telugu News