YS Avinash Reddy: వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ అంశం.. టీఎస్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు

Supreme Court stays orders of TS High Court on YS Avinash arrest matter
  • ఈ నెల 25 వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దన్న టీఎస్ హైకోర్టు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీతారెడ్డి
  • హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తే అవినాశ్ ను అరెస్ట్ చేస్తారన్న ఆయన తరపు లాయర్
  • సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు
  • తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వివేకా కుమార్తె సునీతారెడ్డి వేసిన పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

అయితే, హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తే అవినాశ్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారంటూ ధర్మాసనం దృష్టికి అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది తీసుకెళ్లారు. అంతేకాదు, ఈ కేసుకు సంబంధించి పేపర్ బుక్ కూడా తమ వద్ద లేదని... సునీత పిటిషన్ లో ఏముందో కూడా తమకు తెలియదని... పేపర్ బుక్ తమ వద్ద ఉంటే ఇప్పుడే వాదనలు వినిపించేవాళ్లమని చెప్పారు. సోమవారం వరకు విచారణను వాయిదా వేశారు కాబట్టి, సోమవారం తమ వాదనలను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో, సోమవారం వరకు అవినాశ్ ను అరెస్ట్ చేయవద్దని సుప్రీం ఆదేశించింది. సోమవారం అన్ని విషయాలను పరిశీలిస్తామని తెలిపింది. సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని సుప్రీం ఆదేశించడంతో... అవినాశ్ కు స్వల్ప ఊరట లభించినట్టయింది.
YS Avinash Reddy
Supreme Court
Arrest
YS Sunitha

More Telugu News