YS Vivekananda Reddy: వైఎస్ వివేకానందరెడ్డితో నాకు రెండు సార్లు వివాహం జరిగింది: షమీమ్

YS Viveka and me married twice
  • తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదన్న షమీమ్
  • సునీతారెడ్డి కూడా తనను బెదిరించారని వ్యాఖ్య
  • హత్యకు గురి కావడానికి ముందు కూడా వివేకా తనతో మాట్లాడారని వెల్లడి
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఒక్కో రోజు ఒక్కో కొత్త విషయం వెలుగులోకి వస్తూ ఉత్కంఠను పెంచుతోంది. వివేకాకు షమీమ్ అనే రెండో భార్య ఉందని ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐకి షమీమ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. వివేకాతో తనకు రెండు సార్లు వివాహం జరిగిందని ఆమె తెలిపారు. తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని... ఈ విషయంలో శివప్రకాష్ రెడ్డి తనను ఎన్నో సార్లు బెదిరించారని చెప్పారు. తన తండ్రికి దూరంగా ఉండాలని వివేకా కూతురు సునీతారెడ్డి కూడా తనను బెదిరించారని తెలిపారు. 

తన కొడుకు పేరు మీద భూమి కొనాలని వివేకా అనుకున్నారని... అయితే, వివేకాను శివప్రకాష్ రెడ్డి అడ్డుకున్నారని షమీమ్ చెప్పారు. వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని... చెక్ పవర్ కూడా లేకుండా చేశారని అన్నారు. చెక్ పవర్ లేకపోవడంతో వివేకా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పారు. హత్యకు గురి కావడానికి కొన్ని గంటల ముందు కూడా వివేకా తనతో మాట్లాడారని తెలిపారు. బెంగళూరు ల్యాండ్ సెటిల్ మెంట్ తో మనకు రూ. 8 కోట్లు వస్తాయని చెప్పారని వెల్లడించారు. వివేకా చనిపోయారని తెలిసినప్పటికీ... శివప్రకాష్ రెడ్డిపై ఉన్న భయంతో అక్కడకు వెళ్లలేకపోయానని చెప్పారు.
YS Vivekananda Reddy
Second Wife
Shameem
CBI

More Telugu News