IPL: ఎట్టకేలకు బోణీ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

delhi capitals first win in the ipl16
  • ఐదు ఓటముల తర్వాత తొలి విజయం
  • కేకేఆర్ పై 4 వికెట్ల తేడాతో గెలుపు
  • రాణించిన బౌలర్లు, వార్నర్
ఐపీఎల్ 16వ సీజన్ లో వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. తన ఆరో మ్యాచ్ లో అతి కష్టంగా విజయాన్ని అందుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ పై గెలిచింది. వర్షం వల్ల గంట ఆలస్యంగా ప్రారంభమైన ఈ పోరులో మొదట భారీ హిట్టర్లు ఉన్న కోల్‌కతా 20 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. జేసన్‌ రాయ్‌ (39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ తో 43) టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు. చివర్లో ఆండీ రస్సెల్‌ (31 బంతుల్లో ఫోర్‌, 4 సిక్స్‌లతో 38 నాటౌట్‌) మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ ఆ మాత్రం స్కోరైనా చేసింది. 

రెండు సీజన్ల తర్వాత తొలి మ్యాచ్‌ ఆడిన భారత వెటరన్ పేసర్ ఇషాంత్‌ శర్మ రెండు వికెట్లతో తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. అతనికే  ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. అన్రిచ్ నోకియా, అక్షర్‌, కుల్దీప్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19.2 ఓవర్లలో 128/6 స్కోరు చేసి అతి కష్టంమీద నెగ్గింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ (41 బంతుల్లో 11 ఫోర్లతో 57) మరో అర్ధ శతకం సాధించాడు. అతని ధాటికి పవర్ ప్లేలోనే 61/1తో సునాయాస విజయం దిశగా దూసుకుపోయింది. కానీ, కేకేఆర్ బౌలర్లు వరుస పెట్టి వికెట్లు తీయడంతో ఢిల్లీ తడబడింది. కానీ, మనీశ్‌ పాండే (21), అక్షర్‌ (19 నాటౌట్‌) జట్టును గట్టెక్కించారు. కోల్ కతా బౌలర్లలో అనుకూల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, నితీష్ రాణా తలో రెండు వికెట్లు పడగొట్టారు.
IPL
2023
Delhi capitals
win
kkr

More Telugu News