akhilesh yadav: ప్రభుత్వ వైఫల్యం: భారత జనాభా పెరుగుదలపై అఖిలేశ్ యాదవ్

  • జనాభాలో చైనాను దాటి మొదటి స్థానానికి భారత్
  • ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కంటున్నట్లు చెప్పిన యూపీ మాజీ సీఎం
  • గర్భనిరోధక పద్ధతులను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న అఖిలేశ్ 
Akhilesh on India becoming worlds most populous nation

జనాభాపరంగా భారత్... చైనాను అధిగమించడంపై మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. 142.86 కోట్ల జనాభాతో చైనా (142.56 కోట్లు) కంటే భారత్ ముందుకు వచ్చింది. జనాభా పెరుగుదలతో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానానికి రావడం ప్రభుత్వ వైఫల్యంగా అఖిలేశ్ అన్నారు. ఇది ఆందోళనకరమైన అంశమని, ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణమని గురువారం ట్వీట్ చేశారు. పేదరికం, నిరుద్యోగం కారణంగా తమకు పనిలో సాయంగా ఉంటారని లేదా సంపాదించి పెడతారని భావిస్తూ ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కంటున్నట్లు పేర్కొన్నారు. 

వైద్య సదుపాయాల కొరత కారణంగా శిశుమరణాల భయం కూడా అధిక సంతానానికి దారి తీస్తోందన్నారు. అంతేకాకుండా గర్భనిరోధక పద్ధతులను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సరైన చదువు లేకపోవడం వల్ల అధిక జనాభా అనర్థాలను అర్థం చేసుకోకపోవడం కూడా జనాభా పెరుగుదలకు మరో కారణంగా చెప్పారు.

కాగా, 2022 నాటికి భారత్ జనాభా 141.2 కోట్లు కాగా చైనా జనాభా 142.6 కోట్లుగా ఉండేది. అయితే కొంతకాలంగా చైనాలో జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గుతోంది. భారత్ లోను కొంత మేర క్షీణత కనిపిస్తోంది. అయితే చైనాతో పోలిస్తే ఇది తక్కువే. దీంతో భారత్ ముందుకు వచ్చింది.

More Telugu News