Nakka Anand Babu: వివేకా హత్య కేసులో అసలు ముద్దాయి జగనే.. ఆయన కాపురం ఎక్కడ పెట్టాలో సీబీఐ తేలుస్తుంది: నక్కా ఆనంద్ బాబు

  • వివేకా హత్యను ఎవరు చేయించారనేది అందరికీ తెలుసన్న నక్కా ఆనంద్ బాబు
  • ఇది బ్రహ్మాండమైన క్రైమ్ థ్రిల్లర్ అని వ్యాఖ్య
  • జగన్ రెండు నెలల నుంచి ఢిల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని ఎద్దేవా
  • విచారణలను అడ్డుకునేందుకు అడ్డగోలుగా పిటిషన్లు వేయిస్తున్నారని విమర్శ
tdp leader nakka anand babu comments on cm jagan

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు ముద్దాయి సీఎం జగన్ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి పేర్లు బయటకు వచ్చాయని, జగన్ ప్రమేయం త్వరలోనే వెల్లడవుతుందన్నారు.

గురువారం గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆనంద్ బాబు కేక్ కట్ చేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. వివేకా హత్య కేసు విచారణ నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసమే విశాఖలో కాపురం పెడతానని చెబుతున్నారని విమర్శించారు. ఎన్నికల తర్వాత జగన్‌ కాపురం ఎక్కడనేది ప్రజలు తేలుస్తారని హెచ్చరించారు. 

‘‘వివేకా హత్య ఎవరు చేయించారనేది అందరికీ తెలుసు. కడప జిల్లా ప్రజలైతే హత్య జరిగినప్పటి నుంచే ‘జగన్ చేయించారు’ అని చెబుతున్నారు. భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డే చంపారని చెబుతున్నారు. వారం పది రోజుల నుంచి మొత్తం బయటికి వస్తున్నాయి. ఒక్కొక్కరు జైలుకు వెళ్తున్నారు. భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి ఎవరు? అసలు ముద్దాయి జగన్ మోహన్ రెడ్డి’’ అని ఆరోపించారు.  

‘‘బ్రహ్మాండమైన క్రైమ్ థ్రిల్లర్ ఇది. క్లైమాక్స్ జగన్ దగ్గర ఆగాలి. కానీ అలా జరక్కుండా ఆపుతున్నాడు. రెండు నెలల నుంచి ఢిల్లీ ప్రదక్షిణలు చేస్తున్నాడు. విచారణలను అడ్డుకునేందుకు అడ్డగోలుగా కోర్టుల్లో పిటిషన్లు వేయిస్తున్నారు’’ నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. 

‘‘నువ్వు కాపురం విశాఖపట్నంలో పెట్టుకో, తాడేపల్లిలో పెట్టుకో, ఇడుపులపాయలో పెట్టుకో.. బెంగళూరులో కూడా పెట్టుకో. నాలుగు చోట్ల నాలుగు కాపురాలు పెట్టుకో. ఎవరు వద్దన్నారు. రాజధానిని మార్చొద్దని హైకోర్టు ఏనాడో చెప్పింది. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండగా.. నువ్వు విశాఖకు వెళ్తానని చెబుతున్నావు’’ అని అన్నారు.  

‘‘ఎన్నికలయ్యాక నువ్వు ఎక్కడ కాపురం పెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారు. 12 కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నావు. మీ బాబాయ్ హత్య కేసు కూడా ఉంది. ఎన్నికల్లోపు విచారణలు పూర్తయితే.. నువ్వు ఎక్కడ కాపురం పెట్టాలో సీబీఐ తేలుస్తుంది’’ అని చెప్పారు.

More Telugu News